బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని కాంగ్రెస్ లోకీ వెళ్తున్నారని చెప్పారు. వీళ్ళు ఏ పార్టీలో గెలిచినా.. పవర్ ఎక్కడ ఉంటే అక్కడికీ పరుగులు పెడుతారని విమర్శించారు. తెలంగాణ భవన్ బాగాలేదని ఎమ్మెల్యేలను గాంధీభవన్ కు పంపించి ఏ మొఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్,- కాంగ్రెస్ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనన్నారు. బీఆర్ఎస్-, కాంగ్రెస్ నాయకులు.. ప్రజల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. స్వంత ప్రయోజనాల కోసం మాత్రమే వచ్చారన్నారు.
మే 18వ తేదీ శనివారం వరంగల్ లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని మోడీ నిలిపారని.. ఈ ఎన్నికల్లో 400 సీట్లు NDAకు రాబోతున్నాయని చెప్పారు. మంచి మెజార్టీతో ఎంపీగా ఆరూరి రమేష్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ రాబోతుందని చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని.. హమీలు నెరవేర్చలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందని చెప్పారు కిషన్ రెడ్డి. బ్యాంకుల నుండి అప్పులు తీసుకోని రుణ మాఫీకీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణను కాంగ్రెస్-, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే పరిస్థితులు ఉన్నాయని.. భవిష్యత్తులో రాష్ట్రాన్ని రక్షించుకునే భాద్యత బీజేపీ తీసుకుంటుందన్నారు.
MLC ఎన్నికల్లో బీజేపీకీ మంచి వాతావరణం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని చెప్పారు. పాలక పార్టీ అభ్యర్థి గెలిస్తే సభలో ప్రశ్నించే పరిస్థితి ఉండదన్నారు. బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలబడతారని.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు. గ్లోబల్ ప్రచారంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటేనని.. మాటల గారడితోనే ప్రభుత్వం నడుపుతున్నారని విమర్శించారు. అబద్ధాలతో ఈ రెండు పార్టీలు రాజ్యమేలాలని చూస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.