సోనియాను విమర్శించే అర్హత కిషన్ రెడ్డికి లేదు : బండి సుధాకర్

సోనియాను విమర్శించే అర్హత కిషన్ రెడ్డికి లేదు :  బండి సుధాకర్

హైదరాబాద్, వెలుగు: స్వదేశీ నినాదంతో విదేశీ వ్యాపారం చేసే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సోనియాగాంధీని విమర్శించే అర్హత లేదని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ఓటు – రెండు రాష్ట్రాలు అని కాకినాడలో బీజేపీ చేసిన తీర్మానం ఏమైందో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. 

ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీదేనని వివరించారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్ పై నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన అసత్య, నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఉత్తమ్ ద్వారా అనేక పదవులు పొంది, ఇప్పుడు ఆయననే విమర్శించడం అవకాశవాదానికి నిదర్శనం కాదా? అని బండి సుధాకర్ ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి తక్షణమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.