రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే:కిషన్రెడ్డి

రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే:కిషన్రెడ్డి
  • కాంగ్రెస్​ తప్పుడు ప్రచారం చేసినా.. డబుల్​ ఇంజిన్ ​సర్కార్​కే పట్టం: కిషన్​రెడ్డి
  • రెండు రాష్ట్రాల్లోనూకాంగ్రెస్​ 30 సీట్లు దాటలే
  • దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్​ పార్టీనే కారణమని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: రాహుల్​ గాంధీ చిలకపలుకులను మహారాష్ట్ర ప్రజలు ఏమాత్రం నమ్మలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్​ రెడ్డి అన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రల్లో కలిపి కాంగ్రెస్​ పార్టీకి 30 సీట్లు కూడా దాటలేదని, అంతటి ప్రజావ్యతిరేకత ఆ పార్టీపై ఉన్నదని అన్నారు. 

మహారాష్ట్రలో కాంగ్రెస్​ పార్టీ తప్పుడు ప్రచారం చేసినా.. అక్కడి ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్​ ఇంజిన్​ సర్కార్​కే మరోసారి పట్టం కట్టారని అన్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠాలకు అన్యాయం జరుగుతందంటూ గత పార్లమెంట్​ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధిపొందారని.. కానీ, 5 నెలల్లోనే ప్రజలకు వాస్తవమేంటో తెలిసిందని పేర్కొన్నారు. 

శనివారం ఆయన బీజేపీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, గుజరాత్​ విడిపోయినప్పుడు జరిగిన ఎన్నికల తర్వాత భారీ మెజారిటీ వచ్చిందని, మళ్లీ ఇప్పుడు అంతపెద్ద విజయం దక్కిందని అన్నారు. దేశంలో కులం, భాష, మతం పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టిందన్నారు. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్​ పార్టీనే కారణమన్నారు. 

రాహుల్​కు మతిమరుపు పెరిగింది..

రాహుల్​ గాంధీకి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైందని కిషన్​ రెడ్డి అన్నారు. దేశాన్ని ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్​ ఏం వెలగబెట్టిందన్న విషయాన్ని మరిచి మాట్లాడుతున్నారన్నారు. 

దేశానికి ఎంతో నష్టం చేసి దానికి బీజేపీనే కారణమంటూ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని కాంగ్రెస్​ నేతలు విషప్రచారం చేశారని, వారి అబద్ధాలను ప్రజలు నమ్మలేదని అన్నారు.

 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో మహాయుతి కూటమి విజయం సాధించిందన్నారు. మోదీ చేసిన అభివృద్ధిని వివరించే మహారాష్ట్రలో మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు.