తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల జాగీర్ కాదని.. తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అక్టోబర్ 3న నిజామాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశమవుతుందన్నారు.
మంగళవారం(సెప్టెంబర్ 26) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం సరైనదేనని కిషన్ రెడ్డి అన్నారు. హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం తమకు లేదని చెప్పారు. రాష్ట్రంలో అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటనీ విమర్శించారు.
17సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని, ఖమ్మంలో కూడా పార్టీ బలపడిందన్నారు. ప్రధాని మోడీ పర్యటన తర్వాత అమిత్ షా, నడ్డా పర్యటనలు ఉంటాయన్నారు.