ఈసారి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం: మంత్రి కిషన్ రెడ్డి

ఈసారి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం: మంత్రి కిషన్ రెడ్డి

మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ విజయం సాధించబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆ విజయంలో తెలంగాణ ప్రజలు కూడా భాగస్వామ్యం కాబోతున్నారన్నారు. ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి.. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మొదలయ్యే ప్రచార రథాలను ప్రారంభించారు.

అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదు చోట్ల నుంచి ఈ యాత్రలు ప్రారంభమవుతాయని.. తెలంగాణ భాజపా నాయకత్వం అన్ని చోట్ల యాత్రల్లో పాల్గొంటారని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలు చేపట్టినట్లు తెలిపారు. ఈసారి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు కాకుండా రోడ్డు షోలతో ప్రజల్లో తిరుగుతామన్నారు. సంకల్ప యాత్రతో మోడీ ప్రభుత్వానికి మరోసారి ఆశీస్సులు ఇవ్వాలని ప్రజలను కోరుతామని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.