కేసీఆర్ అవినీతి పాలనపై పోరాడ్తం : కిషన్‌రెడ్డి
- బీఆర్ఎస్తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదు
- పథకం ప్రకారం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు
- ప్రజా ధనాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుంటున్నదని ఆరోపణ
- కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తం: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను పాతరేసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ సిటీ బీజేపీ ఆఫీసులో బండి సంజయ్‌తో
దళిత ముఖ్యమంత్రి హామీ, డబుల్ బెడ్రూం ఇండ్లు సహా నిరుద్యోగ భృతి అని చెప్పి అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నరు” అని మండిపడ్డారు.
లక్ష్మణ్, బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ మంచి ఫలితాలను సాంధించిందని, సంజయ్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని గుర్తుచేశారు. మునుగోడులో కూడా నైతిక విజయం తమదేనని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో బీఆర్ఎస్ ను పాతరేయటానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని అన్నారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యాలయాలకు స్థలం ఉంటుంది. కాని.. పేదలకు ఇవ్వటానికి స్థలం లేదా?” అని ఆయన ప్రశ్నించారు.
ప్రజాధనాన్ని దోచుకుంటున్నరు
పాతబస్తీ ఫలక్ నామా వరకు మెట్రోను ఎందుకు పొడిగించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వల్లే అనేక రైల్వే ప్రాజక్టులు ఆగిపోయాయని తెలిపారు. ఎస్సీ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ లు ఇస్తామంటే కేసీఆర్ సర్కార్ అడ్డుకుందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అధికారాన్ని చేతిలో పెట్టుకొని రాష్ట్రాన్ని మోసం చేస్తున్నదని, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నదని ఆరోపించారు. ‘‘దేశంలోని అన్ని కుటుంబ పార్టీలకు కేసీఆర్ డబ్బులు ఇస్తానన్నరు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో అవినీతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ వ్యాపారం చేయాలన్నా రాష్ట్రంలో వాటా అడుగుతున్నరు. ప్రైవేటు బిజినెస్ లో కూడా వాటా కావాలని డిమాండ్ చేస్తున్నరు. భూముల మాఫియాతో పాటు అన్ని రకాల మాఫియాలు ఉన్నయ్. తెలంగాణ పోలీసు వ్యవస్థను కల్వకుంట్ల కుటుంబం నిర్వీర్యం చేసింది.
తమ కుటుంబానికి అనుకూలంగా వినియోగించుకుంటున్నది” అని ఆయన ఆరోపించారు. ‘‘బంగారు తెలంగాణ ఎక్కడ అయ్యింది? కల్వకుంట్ల కుటుంబం బంగారమైంది. తెలంగాణ సమాజం బంగరమైందా..? గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారు. వాటికి రూపాయి కూడా ఇవ్వడం లేదు. అధికార పార్టీ సర్పంచ్ లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. యూనివర్సిటీల్లో 3 వేల పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 8 వేల పోస్టులు భర్తీ చేయడంలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా ఎందుకు భర్తీ చేయడం లేదు? ” అని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీ నేతలతో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మీటింగ్
ప్రధాని మోదీ వరంగల్ సభను విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని నాయకులు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నాయకులతో గురువారం ఉదయం బర్కత్ పురలోని సిటీ బీజేపీ ఆఫీసులో పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు.
శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళులు
బీజేపీ సిద్ధాంత కర్త శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పలువురు పార్టీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్ఛార్జీ అరవింద్ మీనన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పథకం ప్రకారం బీజేపీపై తప్పుడు ప్రచారం
చేస్తున్నరుపథకం ప్రకారం సోషల్ మీడియాలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ స్వయంగా కుటుంబ పాలన పోవాలని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మోదీ మాట్లాడారు. ఏ ఒక్క శాతం కూడా బీఆర్ఎస్ ను క్షమించడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. కుటుంబ పాలన తెలంగాణ మోడలా..? కొడుకు, అల్లుడు, బిడ్డకు కొన్ని రాష్ట్రాలు ఇవ్వాలి అనుకుంటున్నరు.. ఇది తెలంగాణ మోడలా..? తొమ్మిదేండ్లు సెక్రటేరియెట్‌కు రాని సీఎం.. ఇది తెలంగాణ మోడలా..? వేలాది కోట్ల రూపాయలు దోపిడీ చేయడం తెలంగాణ మోడలా.. మంత్రిత్వ శాఖలు అన్ని కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉండటం తెలంగాణ మోడలా..?” అని ఆయన దుయ్యబట్టారు.
అవినీతి, కుటుంబ పాలన అనే రెండు ప్రధాన అంశాలపై బీజేపీ పోరాటం చేస్తున్నదని, స్వయంగా ఎర్రకోట నుంచి ప్రధాని ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కారులు, అమరవీరులు, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు రాష్ట్రంలో పాలన సాగడం లేదని, నిజాం తరహా పాలన సాగుతున్నదన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కు పరిమితం చేయాలి” అని చెప్పారు. కాగా, ఈ నెల 8న జరుగనున్న ప్రధాని మోదీ వరంగల్ పర్యటనను సక్సెస్ చేయాలని పార్టీ కార్యకర్తలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ALSO READ:న్యాయ వ్యవస్థలో లాయర్లు, ఉద్యోగులూ కీలకమే
కలిసి కట్టుగా పనిచేస్తం: సంజయ్
కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్ఫూర్తితో కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడుతామని చెప్పారు. సొంత పార్టీ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని పార్టీ కేడర్ కు సూచించారు. ఇలాంటి వాటివల్ల సందట్లో సడేమియాగా ఇతర పార్టీల వారు వీటిని అవకాశంగా తీసుకుంటున్నారని చెప్పారు.
‘‘నా మీద అభిమానంతోనో, కోపంతోనో బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ముమ్మాటికి ద్రోహమే అవుతుంది. దయచేసి పార్టీ కేడర్ అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవు. కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని ఓడించడానికి కలిసికట్టుగా పనిచేస్తం. ప్రధాని మోదీ వరంగల్ పర్యటనను విజయవంతం చేయాలి” అని సూచించారు.
‘‘రారా.. పోరా.. అనే చనువు కిషన్‌రెడ్డికి ఉంది
‘‘రారా.. పోరా.. అనే చనువు నా విషయంలో ఒక్క కిషన్ రెడ్డికి ఉంది. విద్యార్థి పరిషత్‌లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కిషన్ రెడ్డికే ఫోన్ చేసేవాడ్ని. ‘డోంట్ వర్రిరా.. సంజయ్’ అని కిషన్ రెడ్డి నాకు ధైర్యం ఇచ్చే వారు” అని బండి సంజయ్ గుర్తు చేసుకు న్నారు. కాగా, బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత మొద టిసారి గురువారం సంజయ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకు ఎయిర్ పోర్టులో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బర్కత్ పురలోని బీజేపీ సిటీ ఆఫీసుకు చేరుకున్న సంజయ్... అక్కడ కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు.