త్వరలోనే బీజేపీ స్టేట్ కమిటీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

త్వరలోనే బీజేపీ స్టేట్ కమిటీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
  • పార్టీ స్టేట్ ఆఫీసులో ఉగాది వేడుకలు

హైదరాబాద్, వెలుగు: త్వరలోనే బీజేపీ రాష్ట్ర కమిటీతో పాటు జాతీయ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని  కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్  రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్  కమిటీలు సహా మండల, జిల్లా కమిటీల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఆదివారం బీజేపీ స్టేట్  ఆఫీసులో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన హోమంతో పాటు పంచాంగ శ్రవణంలోనూ కిషన్  రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

హిందువుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ కూడా ఉంటుందన్నారు. కులాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఉండాలని పండుగలు సూచిస్తాయన్నారు. నూతన తెలుగు సంవత్సరంలో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, ఈ దిశగా ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్  కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.