కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసం అయ్యిందన్నారు తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ పరిపాలనలో రైతులందరూ అన్ని రకాలుగా గోస పడుతున్నారని చెప్పారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, సీడ్స్ సబ్సిడీ, వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆదివారం (ఆగస్టు 27న) రైతు గోస.. బీజేపీ భరోసా పేరిట నిర్వహించిన సభలో రాష్ర్ట ప్రభుత్వంపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
నేటికీ కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి. వరి పంటలకు హాలిడే ఇచ్చే ప్రయత్నం రాష్ర్ట ప్రభుత్వం చేస్తోందన్నారు. రాష్ర్టంలో రైతులకు సకాలంలో వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రుణాలు అందడం లేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ సర్కార్.. వ్యవసాయ రుణాలకు పావలా వడ్డి రుణాలు ఇవ్వడం లేదన్నారు. రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల రాష్ర్టంలోని లక్షలాది మంది కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
రైతుల ఆత్మహత్యల్లో 75శాతం కౌలు రైతులే ఉంటున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణ కల్తీ సీడ్ బాండ్ గా మారిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల సమస్యలు ఏవీ పరిష్కారం కావడం లేదని చెప్పారు. ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి కేసీఆర్ ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని హామీ ఇచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నా.. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
నాలుగు, ఐదేండ్లు రైతు రుణమాఫీ వాయిదా వేసి ఎన్నికల ముందు తూతు మంత్రంగా రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. మెజార్టీ రైతులకు రుణమాఫీ జరగడం లేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో గత ఐదేళ్లుగా చాలామంది రైతుల బ్యాంకు ఖాతాల్లో వడ్డీలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి.. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు.
రైతులుకు ఏదో మేలు చేసినట్లు కేసీఆర్ ప్రభుత్వం ఫొజులు కొడుతుందే తప్ప...తెలంగాణ రైతాంగానికి ఏ మాత్రం లబ్ధి చేకూర్చడం లేదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఎక్కడ వర్షాలు, వరదలు, తుఫాన్లు, కరువు వచ్చినా నష్టపోతుంది రైతులే అని ఆవేదన వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తానని కేసీఆర్ చెప్పారని, ఆ హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులు కమీషన్ల ప్రాజెక్టులగా మారాయే తప్ప.. ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా ప్రతి సంవత్సరం తెలంగాణలో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా పరిస్థితి ఉందన్నారు.
ధరణి వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ధరణి వల్ల సుమారు 20 లక్షల మంది రైతులు తెలంగాణలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. పూర్థిస్తాయిలో రైతుల పక్షాన ఉంటామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతులకు అండగా ఉంటామన్నారు. రైతుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేస్తోందన్నారు. తాము చెప్పిందే చేస్తామన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అవినీతి తప్ప మరోటి లేదన్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబ కోసం పని చేస్తే.. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ.. అవినీతి పార్టీలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసినా కాంగ్రెస్ కు వేసినట్లేనని, కాంగ్రెస్ కు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని, ఈ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే ఎంఐఎం పార్టీకి వేసినట్లే అని చెప్పారు.
గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకున్నాయన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కలిసి పని చేశాయని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల డీఎన్ఏ ఒక్కటే అని చెప్పారు. తెలంగాణ రాష్ర్టంలో మార్పు రావాలంటే.. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీని రాష్ర్టంలో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలు బీజేపీని బలపర్చాల్సిందిగా కోరారు. రైతులకు అండగా బీజేపీ నిలబడుతుందన్నారు. అమిత్ షా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న ప్రతి ఏటా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.