- ప్రజలను మతం, కులం పేరుతో కాంగ్రెస్ రెచ్చగొడుతున్నది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- డిక్లరేషన్లు, మేనిఫెస్టోల పేరుతో ఓట్లు దండుకున్నరు
- అధికారంలోకి వచ్చాక హామీలు ఎగ్గొట్టారు
- రుణమాఫీ అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో విభజించడం, రెచ్చగొట్టడం కాంగ్రెస్కు ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, ప్రకాశ్ రెడ్డి, ఎన్‌వీ సుభాష్, మాధవి, రాణిరుద్రమ తదితరులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.ఇతర దేశాల్లో దేశం గురించి అవమానంగా మాట్లాడటం, సైనికులు, ఆర్థిక పరిస్థితిపై చులకనగా మాట్లాడి దేశ గౌరవాన్ని తగ్గించేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశాన్ని రక్షించే సైనికుల మధ్య కులాల పేరుతో విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగానే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మభ్యపెట్టే హామీలు, గ్యారంటీలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందిందని చెప్పారు. డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టోల పేరుతో గారడీ చేసి ఓట్లు దండుకొని ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నాయకులు డిక్లరేషన్లు, గ్యారంటీలంటూ అనేక హామీలిచ్చి, అమలులో ఎక్కడికి పోయారని ఎద్దేవా చేశారు.
ప్రశ్నిస్తే దాడులు చేయిస్తరా..?
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక హామీలపై యువత ప్రశ్నిస్తే.. లాఠీలతో దాడి చేయిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్ల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.లక్ష కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో సంపద పెంచేలా ఆలోచన చేయడం లేదన్నారు. తెలంగాణలో కేవలం అప్పులను మొబలైజేషన్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 17 పంటలకు మద్దతు ధరతో బోనస్ ఇస్తామని ప్రకటించినా.. ఇప్పటికీ ఏ ఒక్క పంటకూ ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో 38.63 లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నా.. 22 లక్షల మందికే మాఫీ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఇచ్చిన హామీల అమలు చేశామని ధైర్యంగా చెప్పాలన్నారు. రుణమాఫీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.