టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేంత అవసరం లేదు : కిషన్ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలుల విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే మాకేంటి సంబంధమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వందల కోట్లు ఇచ్చి కొనేంత అవసరం తమకు లేదన్నారు. నెంబర్ 1,  నెంబర్ 2 ఎవరు లేరని అంతా భోగస్ అని కిషన్  రెడ్డి తేల్చి చెప్పారు. మునుగోడు ఉపఎన్నికను ఆపాలని ఈసీని కోరలేదని కఠినంగా ఉండాలని మాత్రమే ఈసీని కోరినట్టుగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఫామ్ హౌస్  ​లో డబ్బు దొరికితే...అసలు ఎంత దొరికింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అనేది ఎందుకు బయటపెట్టడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం తమ పార్టీ నాయకులు ప్రయత్నించినట్లు ఆరోపణలు చేస్తున్నందున వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జనరల్ సెక్రెటరీ  అరుణ్ సింగ్ తదితరులు  కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.