
బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2024 మార్చి 24న ఆదివారం బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ కలవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. రాహుల్ ఈ జన్మలో ప్రధాని కాలేరు. గ్యారంటీలు అమలు చేయకుండా రేవంత్ మోసం చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి.