హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో తాను, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్..ఇద్దరం పోటీ చేయొద్దని అనుకుంటున్నామని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘మేమిద్దరం ఎన్నికల్లో పోటీ చేస్తే...మా నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. మేం పోటీ చేయకుండా ఉంటే... రాష్ట్రమంతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయం మా ఢిల్లీ పెద్దల నోటీస్ లో ఉంది.
అయినా చివరికి హైకమాండ్ ఏది చెప్తే... అదే చేస్తం. పోటీ చేయబోమనేది మా ఆలోచన మాత్రమే.. దీనిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, దీనిపై కసరత్తు జరుగుతున్నదన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి టికెట్లు ఖరారు అవుతాయని తెలిపారు. మంచి ముహూర్తం చూసి మొదటి లిస్టు విడుదల ఉంటుందన్నారు. 30 మందికి పైగానే అభ్యర్థుల ఫస్టు లిస్టులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 20 న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఈ నెల 27 న అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తారని, ప్రధాని మోదీ కూడా త్వరలోనే మరోసారి వస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.