కేసీఆర్ పాలన అంతా లిక్కర్ సొమ్ముతోనే : కిషన్ రెడ్డి

కేసీఆర్ పాలన అంతా లిక్కర్ సొమ్ముతోనే : కిషన్ రెడ్డి
  • కేసీఆర్ పాలన అంతా ..  లిక్కర్ సొమ్ముతోనే
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​కు ఓటేస్తే.. మజ్లిస్ చేతుల్లోకి తెలంగాణ: కిషన్ రెడ్డి 
  • బీఆర్ఎస్​కు అధికారమిస్తే రాష్ట్రాన్ని బిచ్చమెత్తిస్తది
  • కుటుంబ పార్టీలను ఓడించాలని కామెంట్ 
  • ముదిరాజుల్లో చైతన్యం రావాలి: రూపాల
  • బీజేపీలో చేరిన బీఆర్ఎస్ లీడర్ పులిమామిడి రాజు 

సంగారెడ్డి, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే రాష్ట్రం మజ్లిస్ చేతుల్లో బందీ అవుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ‘‘బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్టే.. ఒకవేళ కాంగ్రెస్ కు వేసినా అది తిరిగి బీఆర్ఎస్ కు చేరుతుంది. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని మజ్లిస్ తమ గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తుంది. అదే జరిగితే తెలంగాణ అధోగతి పాలవుతుంది. ఆ రెండు పార్టీలకు మజ్లిస్ ను ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకే ఈసారి బీజేపీకి చాన్స్​ ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడాలి” అని కోరారు. 

సోమవారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో కలిసి కిషన్ రెడ్డి హాజరయ్యారు. వీరి సమక్షంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ లీడర్ పులిమామిడి రాజు తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.  

కుటుంబపార్టీలను ఓడించాలె 

రాష్ట్రంలో లిక్కర్​సొమ్ముతో పాలన సాగుతోందని, మద్యం షాపులను, ఓఆర్ఆర్​ను వేలం వేసిన డబ్బుతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల రక్తంతో కేసీఆర్ విమానాలు కొంటున్నాడని, మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే జనం చేతికి చిప్ప రావడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బీఆర్ఎస్​కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు రూ. 10 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. రెండు కుటుంబ పార్టీలను ఓడించి, బీజేపీకి ఒక్క అవకాశమిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామన్నారు. 

ముదిరాజుల్లో చైతన్యం రావాలె: పురుషోత్తం రూపాల

సంగారెడ్డి ముదిరాజ్ లలో వచ్చిన చైతన్యం రాష్ట్రమంతా రావాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ముదిరాజ్ లను బీఆర్ఎస్​పార్టీ మోసం చేస్తే ఆ కులస్తులను బీజేపీ అక్కున చేర్చుకుని, వారి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేస్తోందన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి బీజేపీని బలపరచా లని కోరారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. బీజేపీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం అగ్రవర్ణాల అభివృద్ధి కోసం పని చేస్తోందన్నారు. 

సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 అసెంబ్లీ సీట్లలో ఒక్క ముదిరాజ్ అభ్యర్థి కూడా లేరన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నంతవరకు బడుగు, బలహీన వర్గాల వారు సీఎం అయ్యే చాన్స్ ఉండదని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్​కు కుటుంబ పాలన, కుటుంబ అభివృద్ధి తప్ప మరేదీ ముఖ్యంకాదని విమర్శించారు. అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాల, ఈటల రాజేందర్ లను పులిమామిడి రాజు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, విజయపాల్ రెడ్డి, నాయకులు జయశ్రీ, విష్ణువర్ధన్ రెడ్డి, సంగప్ప, శ్రీకాంత్ గౌడ్ రాజేశ్వర్ రావు దేశ్ పాండే, గోదావరి అంజిరెడ్డి, జయపాల్ రెడ్డి, జగన్, శేఖర్ పాల్గొన్నారు.