- అలాంటిది ఎవరో కుట్ర చేశారంటూ కేసు పెడ్తరా?: కిషన్‌రెడ్డి
- ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడెందుకు మాట్లాడ్తలే
- ప్రాజెక్ట్ క్వాలిటీపై న్యాయ విచారణకు సిద్ధమా?
- ప్రజల్ని మోసం చేసినందుకు కేసీఆర్‌పైనే కేసు పెట్టాలి
- తప్పు తెలుసుకొని సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఒక హిస్టారికల్ బ్లండర్ అని, అదొక పిచ్చి తుగ్లక్ డిజైన్ అని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. చేసిన తప్పును తెలుసుకొని సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌ను రూ.1.30 లక్షల కోట్లకు పెంచిన కేసీఆర్.. అప్పులతో పనికిరాని చెత్త ప్రాజెక్ట్ కట్టిండు. ప్రభుత్వ అసమర్థతతోనే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే.. ఎవరో కుట్ర చేశారంటూ కేసు నమోదు చేయడం హాస్యాస్పదం” అని అన్నారు.
ప్రాజెక్టు క్వాలిటీపై న్యాయ విచారణకు సిద్ధమా? అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. డ్యాం సేఫ్టీని కేంద్ర నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తున్నదని, వాళ్లు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర అధికారులు సరిగ్గా వివరాలు ఇవ్వడం లేదని తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గప్పాలు నరికిన కేసీఆర్ కుటుంబం.. ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు? ప్రజల్ని మోసం చేసినందుకు సీఎంపైనే కేసు పెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది
మేడిగడ్డ వద్ద బ్రిడ్జ్ కుంగిపోవడం తీవ్రమైన అంశమని కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘ సూపర్ ఇంజినీర్ గా అవతారమెత్తిన కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పేరిట కాళేశ్వరం నిర్మించిండు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కాళేశ్వరానికే లైఫ్ లైన్ వంటిది. ఇక్కడ ప్రాజెక్ట్ దెబ్బతింటే... మిగితా రిజర్వాయర్లు, లిఫ్ట్ యాక్టివిటీ, మిగితా ప్రాంతాలకు మళ్లించే నీళ్లు వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోతుంది.
మేడిగడ్డ నాణ్యతపై లోపాలు బయటపడటం.. పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మాణంపైనే అనుమానాలకు తావిస్తున్నది” అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సంపదను దోచుకునే ప్రాజెక్ట్ కాళేశ్వరమని దుయ్యబట్టారు. ఈ యాంటి గ్రావిటీ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం(ఎనీ టైం మనీ)గా మారింది తప్ప... ఏటీ డబ్ల్యూగా (ఎనీ టైం వాటర్) కింద ప్రజలకు ఉపయోగపడలేదని విమర్శించారు. ‘‘తల మీద నీళ్లు ఉంటే నోటి దగ్గరకు తీసుకెళ్లితాగుతం. కానీ, ఈ ప్రాజెక్ట్ ద్వారా తల దగ్గర నీళ్లను కాళ్ల దగ్గరికి చేర్చి... తిరిగి నోటి దగ్గరికి తీసుకున్నట్లు ఉంది” అని వ్యాఖ్యానించారు.
ఎన్డీయేలో భాగస్వామి కాబట్టే జనసేనతో పొత్తు
ఎన్డీయేలో జనసేన భాగస్వామ్యమైనందునే తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడిన తర్వాత జనసేనతో పొత్తు అంశంపై క్లారిటీ వస్తుందని అన్నారు. అయితే ఆంధ్రపదేశ్‌లో పొత్తుపై , రాజకీయాలపై అక్కడి నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. వచ్చే నెల ఒకటిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉంటుందని, ఆ భేటీలో మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు చెప్పారు.
ALS0 READ: ధైర్యంగా ఓటెయ్యండి