
వికారాబాద్, వెలుగు : గిరిజనుల అభివృద్ధి కోసం రూ.24 వేల కోట్లతో ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం రూపొందించామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్లో నిర్వహించిన ప్రధానమంత్రి జన్మన్మహా అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 75 ఏండ్లుగా కనీస సదుపాయాలు లేని గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం గత నెల 15న ప్లాన్రూపొందించామన్నారు. ఇందులో భాగంగా 15 రాష్ట్రాల్లోని 22 వేల గ్రామాలను గుర్తించి 39 లక్షల గిరిజన కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యమన్నారు.
గిరిజనులకు పక్కా ఇండ్ల నిర్మాణం కోసం లక్ష మంది లబ్ధిదారులకు వారి బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్ల నిర్మాణం, 27 వేల ఇండ్లకు నల్లా కనెక్షన్లు, 503 గ్రామాలకు మొబైల్ టవర్స్, 300 గ్రామాలకు కరెంట్కనెక్షన్లు, 10 వేల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు, రూ.5 లక్షల విలువ గల ఉచిత వైద్య సదుపాయం కోసం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను గిరిజన ఆదివాసీలకు ఇవ్వనున్నట్టు చెప్పారు. వీటితో పాటు అవసరమైన వారికి ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 468 గ్రామాలను గుర్తించి అందులో 55 వేల మంది గిరిజన చెంచులకు లబ్ధి చేకూరుస్తామన్నారు. గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించి వారి అర్హతల మేరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి గుట్టను స్వదేశీ దర్శన్ పథకం కింద అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 15 రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. తర్వాత లబ్ధిదారులకు మంత్రి ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జడ్పీ చైర్పర్సన్సునీతా మహేందర్ రెడ్డి, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోటాజీ, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ ఇందిరా, జిల్లా పంచాయతీ ఆఫీసర్ తరుణ్ కుమార్ పాల్గొన్నారు.