రైతుల సంక్షేమం, మేలు కోసం కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. పసుపు బోర్డు తీసుకురావాలని గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలేదని, పట్టించుకోలేదని అన్నారు. రైతులందరి తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. రాబోయే రెండు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం పాలైందన్నారు.
ప్రజలందరూ సాలు కేసీఆర్.. సెలవు కేసీఆర్ అనే ఆలోచనతో ఉన్నారని చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణలో మోదీ నాయకత్వంలో కాషాయ జెండాఎగరాలని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, సోనియాగాంధీ కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బీజేపీ పార్టీని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మోదీ నాయకత్వంలో గోల్కండ కోటలో కాషాయ జెండాఎగరాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
ALSO READ: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు బీజేపీపై ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రజలు తమకు మద్దతుగా ఉన్నారని చెప్పారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే బీఆర్ఎస్ కు సీట్లు అవుతాయన్నారు. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలుపుతుంటే... తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ బీజేపీని బలపర్చాలని, ప్రధాని మోదీ నాయకత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు అని ఆరోపించారు. రెండు పార్టీలకు ప్రజలందరూ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.