కేసీఆర్ కుటుంబంలో అభద్రతా భావం పెరిగింది: కిషన్‌‌ రెడ్డి

కేసీఆర్ కుటుంబంలో అభద్రతా భావం పెరిగింది: కిషన్‌‌ రెడ్డి
  • అందుకే ఆ ఫ్యామిలీ బయటకొస్తే, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నరు 
  • కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ల మీటింగ్‌‌ ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిపక్షాలను నిర్బంధిస్తున్నరు 
  • నిర్మల్‌‌ దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఫైర్‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: నిర్మల్‌‌లో సోఫినగర్ ఇండస్ట్రియల్ జోన్‌‌ను మాస్టర్ ప్లాన్ పేరుతో రెసిడెన్షియల్‌‌ జోన్‌‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌రెడ్డి ఆరోపించారు. నిర్మల్‌‌ మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌కు సంబంధించి జీవో తెచ్చి, రైతులకు నష్టం కలిగించే చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా వారం రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. గతంలో ఇదే సమస్యపై ఆందోళన చేస్తే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎన్నికల టైమ్‌‌ కావడంతో మళ్లీ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తదో రాదో, గెలుస్తమో లేదోనన్న భయం, అభద్రతా భావం కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వంలో ఉందన్నారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఆదివారం పార్టీ స్టేట్‌‌ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మహేశ్వర్‌‌‌‌ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారని, దీనికి​మద్దతు తెలపడానికి వచ్చిన తమ పార్టీ నాయకులపై శనివారం పోలీసులు దారుణంగా వ్యవహరించారన్నారు. వారిపై లాఠీ చార్జ్‌‌ చేశారని, దీంతో దాదాపు 30 మంది గాయపడ్డారని కిషన్‌‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌‌కు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అడ్డుకొని, అక్రమంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. అరెస్టులు, అణిచివేతలకు బీజేపీ భయపడదన్నారు. పోలీసులు బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

ఇది బంగారు తెలంగాణేనా..

ఆదిలాబాద్‌‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలను, జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై లాఠీ చార్జ్‌‌ చేసి, బట్టలు చించేశారని కిషన్‌‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు ఎక్కడికి వెళ్లినా.. బీజేపీ నాయకులతో సహా ప్రతిపక్ష నేతలను ముందుస్తు అరెస్టులు చేస్తున్నారని ఫైర్‌‌‌‌ అయ్యారు. నిజంగా మీది బంగారు తెలంగాణ అయితే, ప్రతిపక్ష నాయకులను, ప్రజా సంఘాల నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. సూర్యాపేటలో పోలీసులతో నిర్బంధించి సభ పెడుతున్నారని, ఎవరిని ఉద్ధరించడానికి కేసీఆర్ ఈ సభ పెట్టారని నిలదీశారు. ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను నిర్బంధించి సభలు, సమావేశాలు పెట్టుకోవాల్సిన దుస్థితి బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వానికి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. దివాలా కోరుతనంతో రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. 

ఈ ప్రభుత్వం ఉండేది నాలుగు నెలలే..

కల్వకుంట్ల కుటుంబం ఉండేది ఇక నాలుగు నెలలు మాత్రమేనని, తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కిషన్‌‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోయిందని, బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ ప్రభుత్వ భూములను వేలం వేసి వ్యాపారస్తులకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. పరిపాలన పక్కనబెట్టి రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని ఫైర్ అయ్యారు. జీవో 111ను ఎత్తివేసి విలువైన భూములను కావాల్సిన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, ప్రగతి భవన్ ఆదేశాలతో వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌‌పరం చేస్తూ.. వాటి నుంచి వందల కోట్లు సంపాదిస్తున్నారని ధ్వజమెత్తారు.

 రాష్ట్రంలో ప్రతి చోట బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, రాబోయే రోజుల్లో వీరు తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాగా, ఎల్బీనగర్‌‌‌‌లో ఎస్టీ మహిళ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని కిషన్‌‌ రెడ్డి మండిపడ్డారు. బాధిత మహిళకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ దుశ్చర్యను, దుర్మార్గాన్ని ఎండగడతామన్నారు.