- ఫిర్యాదు చేసినా.. చనిపోయిన వాళ్ల ఓట్లూ తొలగించట్లే: కిషన్‌రెడ్డి
- రిజల్ట్ తర్వాత రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా బీజేపీ
- ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా గెలుస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇక ముందు జరిగే ఎలక్షన్స్‌లో అయినా అర్బన్ ఏరియాలోని ఓటర్ లిస్టును సంస్కరించాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించాలని ఫిర్యాదులు చేసినా తొలగించడం లేదని చెప్పారు. ఓటర్ లిస్టులు సరిగా ఉండటం లేదన్నారు. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే బాగుండేదనీ, కానీ అందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తమకు సమాచారం ఉందన్నారు.
సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించారని, ఓ కాలనీ ఓట్లన్నీ డిలీట్ చేశారని ఆరోపించారు. కుట్రపూరితంగా కొన్ని వర్గాలతో కొందరు అధికారులు కుమ్ముక్కై ఇలా చేశారన్నారు. ఓటర్ లిస్టులను స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉందని, తమ ఇంట్లో తమ బాబు ఓటు ఒక చోట.. తన ఓటు ఇంకో చోట ఉందన్నారు. ఇలాంటి వాటిని సెట్ చేయాలని కేంద్రమంత్రిగా మున్సిపల్ అధికారులకు లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపారు.
మోదీకి అండగా గ్రామీణ ప్రాంతాలు
గత 2019 పార్లమెంటు ఎన్నికల్లో 62.7% పోలింగ్ నమోదైందని, ఈసారి అది 65% దాటుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీ విజయం సాధిస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా ప్రజలు మోదీకి అండగా నిలిచారని చెప్పారు. పట్టణప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి.. చాలామంది ఏపీకి వెళ్లడం, ఇతర కారణాలున్నాయని చెప్పారు.
డబుల్ డిజిట్ సాధిస్తం
కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని.. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కుటిల యత్నాలను ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని, ప్రతిదానికి మోదీని చాలెంజ్ చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా తమ స్థాయిని చూసుకుని సవాల్ విసిరితే బాగుంటుందన్నారు. ఎవరేందనేది జూన్ 4న తెలిసిపోతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరిగిన పోలింగ్‌తో బీజేపీ తెలంగాణలో కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన వెంట పార్టీ నేతలు బంగారు శృతి, ప్రకాశ్ రెడ్డి, ఎన్వీ సుభాష్, అమర్ నాథ్, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.