హైదరాబాద్, వెలుగు: ‘‘గ్రేటర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు ముందు హుస్సేన్‌సాగర్ నీళ్లు తాగండి. ఆ తర్వాత ఓట్లు అడగండి. అవి కొబ్బరి నీళ్లా కాదా చెప్పాలి. ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్ లీడర్లను ప్రజలు నిలదీయాలి” అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఒవైసీ కుటుంబం, న్యూ సిటీని కల్వకుంట్ల కుటుంబం పంచుకున్నాయని మండిపడ్డారు. కొంపల్లిలో బీజేపీ మీటింగ్ జరుగుతుంటే భయంతో 8వ నిజాం కేసీఆర్ ప్రగతి భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఒవైసీతో చర్చిస్తున్నారని విమర్శించారు. గురువారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలో బీజేపీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు.
6 లక్షల మందిని రోడ్డున పడేసిన చరిత్ర కేసీఆర్ ది
5 ఏళ్లు పరిపాలన చేసి హైదరాబాద్ ను వరదల్లో ముంచారని కిషన్ రెడ్డి ఆరోపించారు. వరదలతో 6 లక్షల మందిని రోడ్డున పడేసిన చరిత్ర కేసీఆర్ ది అని మండిపడ్డారు. వర్షాలు, వరదలతో 40 మంది చనిపోయారని, ఆ బాధ్యత కేసీఆర్ ది కాదా అని ప్రశ్నించారు. ‘‘కరోనా కట్టడికి కేంద్రం ఏం సాయం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించేందుకు మేం రెడీ. గ్రేటర్ లోని ఏ చౌరస్తా లోనైనా, నువ్వు తాళం వేసిన ఉస్మానియా హాస్పిటల్ లో అయినా చర్చకు సిద్ధం. ఎక్కడికి రావాలో చెప్పాలి” అని సవాల్ చేశారు. మేయర్ పీఠం మీద బీజేపీ కార్యకర్తను కూర్చోబెట్టే వరకు కార్యకర్తలు నిద్రపోకూడదని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్, ఎంఐఎంలను నిలదీయండి: లక్ష్మణ్
ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు టీఆర్ఎస్, ఎంఐఎంలను నిలదీయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ తీరుపై జనం అసంతృప్తితో ఉన్నారన్నారు. కరోనా పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన విరాళాలను దండుకున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత జోష్ వచ్చిందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. తాము కలలు కన్న తెలంగాణ ఇది కాదని ప్రజలు గుర్తించారన్నారు. మా తెలంగాణ మాకు కావాలే అని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ నియంత పాలనను సాగనివ్వొద్దని పిలుపునిచ్చారు.
బీజేపీ అంటేనే వణుకుతుండు: సంజయ్
బీజేపీ అంటే కేసీఆర్ వణుకుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మంత్రులంతా కేసీఆర్‌తో చెప్పినట్లు తెలిసిందని తెలిపారు. రాష్ట్రంలో ఐదుగురు సీఎంలు ఉన్నారని, తాగుబోతు, వర్రుబోతు, బూతు మంత్రులని మండిపడ్డారు. దేశ ద్రోహుల పార్టీ ఎంఐఎంతో కేసీఆర్ దోస్తానా చేస్తున్నాడని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నడని ఎగతాళి చేశారు. ఇవి దేశ ద్రోహులకు, దేశభక్తులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, దేశ భక్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
బీజేపీ జెండా ఎగరేస్తం: అరుణ
దుబ్బాక విజయంపై తమ పార్టీ కార్యకర్తలే కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పండుగ చేసుకున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అహంకారం ఎక్కువైందని, నెత్తికి ఎక్కిన కండ్లు కిందికి దిగాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 డివిజన్లు గెలిచి టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతామని, బీజేపీ జెండాఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్.. తెలంగాణకు షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద రూ.వేల కోట్లు కమీషన్ల రూపంలో దండుకున్నారని మండిపడ్డారు. రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుపై లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని చెప్పారు. మేఘా వంటి పెద్ద కంపెనీలకు కేసీఆర్ కాంట్రాక్టులు కట్టబెడుతూ కమీషన్ల రూపంలో రూ.వేల కోట్లు వెనకేసుకుంటున్నారని దుయ్యబట్టారు. గురువారం హైదరాబాద్ లో నేషనల్ మీడియాతో వివేక్ మాట్లాడారు. మిషన్ భగీరథలో కూడా భారీ అవినీతి జరిగిందన్నారు. 60 వేల కోట్లు ఉన్న అప్పును ఆరేళ్లలో 4 లక్షల కోట్లకు పెంచి, అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్, తన సొంత ఆస్తులను మాత్రం భారీగా పెంచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతానన్నారు. త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి సీఎం అవినీతి చిట్టాను అందిస్తానని చెప్పారు.
ప్రజలను మోసగించి పాలన
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతకు ఇప్పుడు ఆత్మహత్యలే దిక్కయ్యాయని వివేక్ అన్నారు. నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ‘‘తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారిని కేసీఆర్ విస్మరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని పక్కన పెట్టుకొని పాలన చేస్తున్నారు. తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషించేలా సీఎం కేసీఆర్ తీరు ఉంది. ఇది అమరుల కుటుంబాలను అవమానించడమే” అని వివేక్ చెప్పారు. ప్రజలను మోసగించి పాలన చేయడమే కేసీఆర్ నైజమన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని చెప్పి, ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇతర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం జరుగుతుండగా, ఇక్కడ మాత్రం ఆ పథకం అమలు చేయరని మండిపడ్డారు. ప్రజా అవసరాలను గుర్తించకుండా, తన సొంత ఎజెండాతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పాత సెక్రటేరియట్ కూల్చి కొత్తది నిర్మాణం చేపట్టడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
నియంతృత్వానికి వ్యతిరేకంగా దుబ్బాక తీర్పు
నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగానే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లు తీర్పునిచ్చారని, బీజేపీకి పట్టం కట్టారని వివేక్ చెప్పారు. యువత, రైతులు, దళితులు, బలహీన వర్గాల వారు సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనడానికి ఈ తీర్పే నిదర్శనమన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు విసిగెత్తిన జనం టీఆర్ఎస్ను ఓడించి, ఆయనకు కనువిప్పు కలిగించారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్, తన తుగ్లక్ పాలనతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. మానవ హక్కులను హరించారని, రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. దుబ్బాక రిజల్ట్ తర్వాత రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్తలో మంచి జోష్ వచ్చిందని, త్వరలోనే రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ అవతరించనుందన్నారు. టీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.