రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు పెద్దగా తేడా లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే సామార్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వ్యాగన్ల తయారీతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జూలై 8న మోడీ రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు, నేషనల్ హైవేలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మోడీకి వెల్ కమ్ చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మోడీ రాగానే వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. వరంగల్ అభివృద్ధిలో కేంద్ర భాగస్వామ్యం ఉందన్న ఆయన.. అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా ఎదగాలన్నదే మోడీ ఆకాంక్ష అని అన్నారు
కేంద్ర సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్రం అండగా నిలుస్తోందన్నారు. వరంగల్ కు టెక్స్ టైల్ పార్క్ ను కేంద్రం మంజూరు చేసిందని.. దేశంలో ఏడు మెగా టెక్స్ టైల్ పార్కులు ప్రారంభిస్తే.. అందులో ఒకటి తెలంగాణకు రావడం గర్వకారణమన్నారు. ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ దేశంలోనే మొదటిదన్నారు కిషన్ రెడ్డి. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు నిధులు మంజూరు చేశామన్నారు.హైదరాబాద్ కు ట్రిపుల్ ఆర్ కేటాయించామని.. ట్రిపుల్ ఆర్ భూసేకరణకు రూ.300 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ట్రిపుల్ ఆర్ కు వేగవంతంగా భూసేకరణ చేయాలన్నారు. ట్రిపుల్ ఆర్ తో లక్షలాది మందికి ఉపాధి వస్తుందన్నారు. భూసేకరణ కోసం కేసీఆర్ కు ఎన్ని లేఖలు రాసినా స్పందించడం లేదన్నారు కిషన్ రెడ్డి.