మా నేతల ఫోన్లు ట్యాపింగ్​ చేస్తున్నరు

మా నేతల ఫోన్లు ట్యాపింగ్​ చేస్తున్నరు

ఫిర్యాదులొస్తున్నయ్​.. ఈసీకి కంప్లైంట్​ చేస్తం

వరద సాయంలో భారీ అవినీతి: కిషన్​రెడ్డి

మిగులు బడ్జెట్​ రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల పాలు చేశారు

కేంద్ర నిధులపై చర్చకు రెడీనా అని సవాల్

జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే: బండి సంజయ్

పాతబస్తీ కోసం ఖజానా నుంచి ఎంత ఖర్చు పెడ్తున్నరో చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్​ చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక బైఎలక్షన్​ సందర్బంగా తమ ఫోన్లను ట్యాప్​ చేసినట్టుగా బీజేపీ నేతల నుంచి తనకు ఫిర్యాదులు అందాయని.. రాష్ట్ర సర్కారు ఇలా చేయడం సరైనదేనా అని ప్రశ్నించారు. దీనిపై ఎలక్షన్​ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని, ట్యాపింగ్​ నిజమని తేలితే కేంద్ర అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కరోనా టైంలో రాష్ట్ర సర్కారు చేసిందేమిటి, కేంద్రం ఇచ్చిన నిధులెన్ని అన్న దానిపై సీఎం కేసీఆర్ చర్చకు రెడీనా అని కిషన్​రెడ్డి  సవాల్ చేశారు. కేంద్రం సాయం చేయలేదంటూ టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలన్నారు. బుధవారం కిషన్​రెడ్డి, పార్టీ రాష్ట్ర చీఫ్​బండి సంజయ్, సీనియర్​ నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి జూమ్​ యాప్​ ద్వారా మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్​ సర్కారు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వమే డైరెక్టుగా ఫండ్స్​ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్ల నిధులు కేంద్ర సహకారంతోనే సమకూరాయన్నారు.

వరద సాయంలో భారీగా అవినీతి

గ్రేటర్​ లో వరద బాధితులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం పంపిణీలో భారీ అవినీతి జరుగుతోందని కిషన్​రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దోచుకునేందుకే ఈ పంపిణీ చేపట్టారని.. పేదలకు సొమ్మును మింగేస్తున్నారని మండిపడ్డారు.

కాషాయ జెండా ఎగరేస్తం: బండి సంజయ్

త్వరలో జరిగే గ్రేటర్​ హైదరాబాద్​ ఎలక్షన్లలో కాషాయ జెండా ఎగరేస్తామని, ఈసారి మేయర్ పీఠం బీజేపీదేనని పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఎలక్షన్లకు ముందు జీహెచ్ఎంసీలో నిర్వహించిన సర్వేలో బీజేపీకి 75 సీట్లకుపైనే వస్తాయని తేలిందని చెప్పారు. 2023 సాధారణ ఎలక్షన్లలో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామన్నారు. దుబ్బాక జనం బీజేపీని గెలిపించి కేసీఆర్ కు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని.. జీహెచ్ఎంసీ ప్రజలు బీజేపీని గెలిపించి కేసీఆర్ కు సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారని పేర్కొన్నారు. పాతబస్తీకి ఎంత ఖర్చు పెడుతున్నారనే దానిపై సీఎం కేసీఆర్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్​ ఓటర్ల జాబితాలో ఉన్న అవకతవకలపై తమ అభ్యంతరాలను ఈసీ పరిష్కరించాలని సంజయ్ కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

For More News..

నెల అయినా బురదల్నే.. వరద నుంచి బయటపడని సిటీ కాలనీలు

డిసెంబర్‌ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్

దుబ్బాక ఓటమితో జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరపడుతున్న టీఆర్ఎస్