ప్రపంచానికి భారత్ ​ఇచ్చిన విలువైన కానుక యోగా

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో కేంద్రంలో కొలువుదీరిన తర్వాత భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సనాతన జీవన వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014 నవంబర్ లో ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఆయుర్వేదం, యోగా వంటి ఏడు సంప్రదాయ భారతీయ పద్ధతులను ప్రజారోగ్య సంక్షేమ వ్యవవస్థలోకి తీసుకొచ్చింది. 2014 డిసెంబర్ నాటికి ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు కలిసి యోగా ఆవశ్యకతను అంగీకరించి జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 

2016 జూన్ లో అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. యోగా విషయంలో భారతదేశం మేధోసంపత్తి హక్కులను(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) తీసుకోలేదని, భారతీయ జ్ఞాన సంపద సమస్త మానవాళికి నిరంతరం అందుబాటులోనే ఉంటుందని పేర్కొన్నారు. ‘యోగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశం ఇచ్చిన విలువైన కానుక’ అని వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ప్రధాన మంత్రి బహిరంగంగానే వెల్లడించారు. యోగాలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి, సనాతన జీవన విధానం నుంచి వారసత్వంగా వస్తోంది. ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, భారతీయతత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక ధృక్పథాన్ని బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించింది. తూర్పున ఉన్న వ్లాదివస్తోక్ నుంచి పశ్చిమాన ఉన్న వాంకోవర్ వరకు, దక్షిణాన ఉన్న కేప్‌‌‌‌టౌన్ నుంచి ఉత్తరాన ఉన్న కోపెన్‌‌‌‌ హగన్ వరకు ప్రతి దేశం యోగాలోని శక్తిని, రోగనిరోధక సామర్థ్యాన్ని గుర్తించి వినియోగంలోకి తీసుకొచ్చాయి. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న వారందరూ.. ఆనందకర జీవితాన్ని పొందుతున్న తీరే ఇందుకు నిదర్శనం. వివిధ వ్యాధులకు సరైన చికిత్స నుంచి మరికొన్ని సమస్యలు రాకుండా నివారించుకునేందుకు యోగా ఓ సాధనంగా మారింది. 

గత ప్రభుత్వాల హయాంలో..

21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా యోగా మానవాళి ఆరోగ్యానికి అత్యవసర, నిత్యావసర సాధనకు వేదికైంది. యోగా అత్యంత ప్రాచీనమైన భారతీయ సంపద అయినప్పటికీ.. ఇటీవలి కాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా యోగాను ఆమోదించి తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం పోషించిన పాత్ర చిరస్మరణీయం, అభినందనీయం. 2014కి ముందు గత ప్రభుత్వ హయాంలో లోక్‌‌‌‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు లేవనెత్తిన రెండు ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుంటే.. యోగా, సాంప్రదాయ భారతీయ విజ్ఞాన వ్యవస్థల పట్ల అప్పటి ప్రభుత్వం చూపించిన ఉదాసీనత, నిర్లక్ష్యం ఎలాంటిదో అర్థమవుతుంది. 2007 ఆగస్టులో లోక్‌‌‌‌సభలో ‘అమెరికాకు చెందిన పేటెంట్స్, ట్రేడ్ మార్క్ ఆఫీసు వారు యోగాపై మేధోసంపత్తి హక్కులను అమెరికా ప్రభుత్వానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. యోగా భారతీయ సనాతన సంప్రదాయ విధానం అయినందున, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించిందా? లేదా?’ అన్న ప్రశ్నకు నాటి ప్రభుత్వం ‘ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలేమీ లేదు’ అని సుస్పష్టంగా సమాధానం ఇచ్చింది. 2014 ఫిబ్రవరిలో  కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు కొద్దిరోజుల ముందు, నాటి ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. మార్చి 2009లో యోగాపై ఏర్పాటు చేసిన టాస్క్‌‌‌‌ఫోర్స్ ఇంతవరకు తమ నివేదికను సభకు అందజేయలేదని తెలిపింది. గత ప్రభుత్వం యోగా, భారతీయ సనాతన వ్యవస్థ విషయంలో నిర్లిప్తతను ప్రదర్శిస్తే.. ఆ తర్వాత వచ్చిన మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు దక్కేలా కృషిచేసింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే.

మరింత ముందుకు తీసుకెళ్దాం..

మన చరిత్రను చెరిపేసేందుకు, మన సనాతన జీవన విధానాలపై జరిగిన ఎన్నో కుట్రలను ఎదుర్కొని మన సాంస్కృతిక వైభవాన్ని కాపాడేందుకు మన పెద్దలు చేసిన త్యాగం నిరుపమానమైనది. తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన సనాతన జీవన జ్ఞాన సంపదను గుర్తు చేసుకుంటూ, వారు వారసత్వంగా ఇచ్చిన యోగాలో నిగూఢంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను ఘనమైన ఉత్సవంగా జరుపుకునేందుకు ఇంతకుమించిన మరో సందర్భం ఏముంటుంది? ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. అయితే దీన్ని మరుపురాని ఘట్టంగా మార్చేందుకు ప్రభుత్వంతోపాటు ప్రభుత్వేతర సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, యోగా ప్రేమికులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇయ్యాల కోట్లాది మంది జీవితాల్లో ఓ భాగంగా మారిన యోగాను మరింత ముందుకు తీసుకెళ్లాలి. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలతో పాటు జాతీయ చైతన్య భావన జాగృతమైంది. అటు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన విలువైన కానుక ‘యోగా’ అంతర్జాతీయ చైతన్యంలోనూ ప్రస్ఫుటంగా కనబడుతోంది. రండి, అందరు కలిసి రండి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం రోజు మీ ఇంట్లో, మీ బస్తీలో, వాడల్లో, గ్రామాల్లో, విద్యా సంస్థల్లో, మీ కార్యాలయాల్లో సామూహికంగా, స్వచ్చందంగా పాల్గొందాం. మన వారసత్వ సంపదను మన జీవితాల్లో నిత్యకృత్యంగా మార్చుకుందాం. 

అమృత్​మహోత్సవ్​లో భాగంగా..

జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమవుతున్న సందర్భమిది. ఏడాదికేడాది యోగాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. నిరుడు కరోనా నేపథ్యంలో మన దేశంలో 15 కోట్లకు పైగా మంది అంతర్జాతీయ యోగా ఉత్సవం రోజు వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం స్వాతంత్ర్య సాధనకు75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏడాది పాటు వివిధ ప్రాంతాల్లో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం, మన స్వాతంత్ర్య సంగ్రామంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల ఘన కీర్తిని, మన సంస్కృతీ సంప్రదాయాలను, వైభవోపేతమైన చరిత్రను, ఘనమైన వారసత్వ సంపదను కాపాడుకునేందుకు అసువులు బాసిన వీరులకు శ్రద్ధాంజలి సమర్పించుకుంటూ నేటి తరం, యువతరం, నవతరానికి చైతన్యం చేస్తున్నాం.  

- జి. కిషన్​రెడ్డి,
కేంద్ర సాంస్కృతిక, 
పర్యాటక శాఖ మంత్రి