రాజ్యాంగంపై దాడి చేసిందే కాంగ్రెస్​ : కిషన్​ రెడ్డి

రాజ్యాంగంపై దాడి చేసిందే కాంగ్రెస్​ : కిషన్​ రెడ్డి
  • అంబేద్కర్​ను ఆ పార్టీ ఎన్నోసార్లు అవమానించింది
  • అమిత్​ షాపై ఫేక్​ వీడియో కేసులో తొలి నిందితుడు రేవంతేనని కామెంట్​

హైదరాబాద్, వెలుగు:  దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంపై కాంగ్రెస్​ పార్టీ ఎన్నోసార్లు దాడి చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్​ను సైతం ఆ పార్టీ చాలాసార్లు అవమానించిందని చెప్పారు. సామాజిక న్యాయం చేయాలన్న ఆలోచనే కాంగ్రెస్​కు లేదని ఆరోపించారు. ఎంపీ​ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. వారం రోజుల నుంచి సీఎం రేవంత్​ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని.. అతని నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటున్నారన్నారు. 

బుధవారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో కిషన్​ రెడ్డి సమక్షంలో వరంగల్​ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీఆర్​ఎస్​ కార్పొరేటర్​ కల్పన తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల వేళ రేవంత్​ రెడ్డి తలపై గాడిదగుడ్డు పెట్టుకుని ఊరేగుతున్నారని విమర్శించారు. ‘‘5 నెలల పాలనలో తాను ప్రజలకిచ్చింది ఇదేనంటూ గాడిద గుడ్లు తలపై పెట్టుకుని ప్రజలకు వివరిస్తున్నారు. 

ఎన్నికలకు వెళ్లేటప్పుడు ఏ పార్టీ అయినా ప్రజలకు చేసిన, చేయాల్సిన పనులను వివరిస్తుంది. కానీ, కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికొదిలేసింది. ఆగస్టు 15న రుణమాఫీ అంటూ ఊదరగొడుతున్నది. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం కనిపించడం లేదు. దీంతో 14 సీట్లు గెలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తన కాళ్లకింద భూమి కదిలిపోతుంటే ఏమీచేయలేని స్థితిలో రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగం మారుస్తారంటూ దుష్ప్రచారం చేశారు’’ అని కిషన్​రెడ్డి ఆరోపించారు. 

ఫేక్​ వీడియో బాధ్యత రేవంత్​దే

రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ఫేక్​ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్​ పార్టీయేనని కిషన్​రెడ్డి అన్నారు. దానికి పూర్తి బాధ్యత రేవంత్​దేనని, ఈ విషయంలో మొదటి నిందితుడు ఆయనేనని పేర్కొన్నారు. మార్ఫింగ్​ వీడియోలు సృష్టించిన వారు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో మోదీకి, బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక మార్ఫింగ్​ వీడియోలతో బురదజల్లుతున్నారని ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను పాతరేయడం ఖాయమని కిషన్​రెడ్డి అన్నారు.