- లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 375 సీట్లొస్తయ్: కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితమైతది
- బీఆర్ఎస్ కు ఒక్క సీటూ రాదు
- ఈ సారి ఓల్డ్ సిటీ సీటు కూడా తమదేనని ధీమా
- ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొనసాగిన బీజేపీ యాత్ర
మంచిర్యాల/కోల్ బెల్ట్/బెల్లంపల్లి/ ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే అని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి.కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన అంతా అవినీతి, కుంభకోణాలేనని.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 10 ఏండ్లలో తెలంగాణను నిలువునా దోచుకున్నాడని విమర్శించారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్, మంచిర్యాల జిల్లా తాండూర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాలలో కిషన్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ కుటుంబ పాలనకే పరిమితమయ్యాయన్నారు. సోనియాగాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని, కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలని తపిస్తున్నారని అన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో గత పదేండ్లలో కేసీఆర్ కుటుంబం ల్యాండ్, శాండ్, లిక్కర్, గ్రానైట్, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, గొర్రెలు, బర్రెలు, ఉద్యోగాలు ఇలా అన్నింట్లో దోపిడీ చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా అదే కోవలో సాగుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు సోనియా కుటుంబానికి ఊడిగం చేస్తున్నారన్నారు. రాహుల్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్ లో రియల్టర్లు, బిల్డర్లు, కంపెనీల వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ సూట్ కేసులతో మంత్రులు రోజూ ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు.
రాహుల్ ఈ జన్మలో ప్రధాని కాలేడు..
దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 375 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 40 ఎంపీ సీట్లకే పరిమితం అవుతుందని, బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. ఈ సారి హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనూ కాషాయ జెండా ఎగురవేస్తామని, అసదుద్దీన్ ఓవైసీని ఓడించి తీరుతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లక తప్పదన్నారు. ఆయన ఈ జన్మలో ప్రధానమంత్రి కాలేడన్నారు. ప్రధాని మోదీ మన దేశానికే కాదు ప్రపంచానికే లీడర్ గా గుర్తింపు పొందారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే భారత్ ను ఐదో స్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడి కళ్లలోకి చూసేవారు కాదన్నారు. ఇప్పుడు మోదీ ముందు అదే అమెరికా అధ్యక్షుడు చేతులు కట్టుకుని నిలబడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి.. మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, పార్టీ నేతలు కొత్తపల్లి శ్రీనివాస్, వెరబెల్లి రఘునాథ్ రావు, అమురాజుల శ్రీదేవి, బొడిగ శోభ, పల్లె గంగారెడ్డి, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.