- అంబేద్కర్‌ను అన్నింటా ద్వేషించిన చరిత్ర ఆ పార్టీది: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తిరోగమన దిశలో నడిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకొని పని చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఏ వర్గాలు సంతృప్తికరంగా లేవన్నారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో ఒక ప్రటకనలో పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, యువతకు ఇస్తామన్న రూ.4,000 నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటన అమలు కావడం లేదని మండిపడ్డారు.
మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సహాయం కూడా రావట్లేదని చెప్పారు. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని, రైతు భరోసా కూడా అరకొరగానే అందిందని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు నుంచి గీత కార్మికుల వరకు ఇస్తామన్న భరోసాను విస్మరించారని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు అంతే లేదన్నారు.
మరోవైపు, అంబేద్కర్‌ను అన్నింటా ద్వేషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో అంబేద్కర్‌కు వ్యతిరేకంగా సదోబా కజ్రోల్కర్ నిలబెట్టింది, అనంతరం కజ్రోల్కర్‌కు పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తుచేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలు నిజ సర్వూపం అంటూ ట్విట్టర్‌లో అంబేద్కర్, నెహ్రూ, కజ్రోల్కర్ ఫొటోలను జత చేశారు.