
న్యూఢిల్లీ, వెలుగు: ఆపత్కాలంలో దేశానికి, ప్రధానికి అండగా ఉండాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు టెర్రరిస్టుల భాషలో మాట్లాడుతున్నారని, ఇది అత్యంత హేయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు బాధ్యత మరిచి ప్రధాని మోదీని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో కిషన్ రెడ్డి వెల్లడించారు.
దాయాది దేశంతో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష నేతలు.. అన్ని విలువలకు తిలోదకాలిచ్చారు. పాకిస్తాన్, ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలో మాట్లాడుతున్నారు. పాక్ మంత్రులు మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వారికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు’’అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.