‘‘మునుగోడులో ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వారి అనుచరులను, గూండాలను తీసుకొచ్చి దాడులు చేస్తున్రు. రోజురోజుకు టీఆర్ఎస్ ఆగడాలు ఎక్కువైతున్నయ్. లోకల్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నరు. గులాబీ జెండా కనబడితే చాలు పోలీసులు సెల్యూట్ చేస్తున్నరు. చెక్ పోస్ట్‌ల వద్ద కనీసం వాళ్ల వాహనాలను ఆపడం లేదు. దీనిపై డీజీపీతో చర్చిస్త’’
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హింసను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ కు ఓటమి తథ్యమని భావించి, నియోజకవర్గంలోని గ్రామాల్లో ఘర్షణ వాతావరణ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మునుగోడులోని బీజేపీ క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పలివెల గ్రామంలో శాంతంగా ఈటల రాజేందర్ చేస్తుంటే.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని, ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. గత కొన్ని రోజులుగా ఈటల పై కక్ష సాధిస్తున్నారని, పక్కా ప్లాన్ తోనే దాడికి దిగారని మండిపడ్డారు. గన్‌మన్ అడ్డుకోకపోతే ఈటల రాజేందర్‌కు కూడా గాయాలయ్యేవని, ఈటలపై దెబ్బపడితే ఆ సంగతి వేరేగా ఉంటుందని టీఆర్ఎస్ నేతలను ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్తాల్లో రాళ్లు నింపుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని కిషన్ కోరారు.
భయపడేది లేదు: ఈటల
పలివెల గ్రామంలో బీజేపీకి ఆదరణ పెరిగి, టీఆర్ఎస్కు ఆదరణ తగ్గిందని, ఆ కసితోనే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడులకు దిగారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. గూండాయిజానికి భయపడేది లేదని హెచ్చరించారు.
ఓటమి భయంతోనే దాడి
బీజేపీ చేతిలో ఓటమి ఖాయమైందనే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్ పెద్దలు బైపోల్ ఆపేందుకు కుట్ర చేస్తున్నరు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న సీఎం కేసీఆర్ డైరెక్షన్ మేరకే ఈటలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దాడులు చేయించాడు. పోలీసులు అక్కడే ఉన్నా దాడులను అడ్డుకోలేదు. మునుగోడు ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నరు. ఓటు ద్వారానే కేసీఆర్‌కు బుద్ధిచెప్తరు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి 30వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నరు. - బీజేపీ మునుగోడు బైపోల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి