
- ఇకనైనా అబద్ధాలు మాని.. కోర్టు చెప్పినట్టు చెట్లు నాటండి: కిషన్ రెడ్డి
- అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో చెట్లను నరికేశారని రాష్ట్ర సర్కార్‌పై ఫైర్
- ధర్నాలు చేసినంత మాత్రాన అవినీతి మరకలు పోవన్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పును ఒప్పుకుని, కోర్టు ముందు వితండవాదాలు మానుకోవాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హితవు పలికారు. అబద్ధాలు చెప్పడం మానేసి, సుప్రీంకోర్టు చెప్పిన మేరకు ఆ భూమిలో మొక్కలను నాటితే బాగుంటుందని సూచించారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్లు పెట్టి చెట్లను నరికేశారని రాష్ట్ర సర్కార్‌పై ఆయన ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలు దేశ చరిత్రలో ఎక్కడా లేవన్నారు. ‘‘పోలీసు బందోబస్తు పెట్టి వంద ఎకరాల్లో చెట్లు నరకడం కాంగ్రెస్ దుర్మార్గానికి అద్దం పడుతున్నది. చెట్లు నరకడం కరెక్టు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే విషయాన్ని ఆనాడు ప్రధాని మోదీ చెప్పారు. వాల్టా చట్టం కింద చెట్లు నరకాలన్నా అనుమతి తీసుకోవాలి. వంద ఎకరాల్లో చెట్లు నరికేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు? భూములు అమ్ముతున్నరా లేదా? ఉపాధికల్పన జరుగుతున్నదా లేదా? అనేది కాదు.. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీపడొద్దన్నదే మా ఆలోచన. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కాంక్రీట్ జంగల్‌గా మారడంతో చుట్టుపక్కలనున్న ప్రాంతాల్లోని వణ్యప్రాణులు, పక్షులకు హెచ్‌సీయూలోని చెట్లే ఆవాసంగా మారాయి. అలాంటి భూములను భావితరాల కోసం కాపాడుకోవడం అందరి బాధ్యత. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే భూములను అమ్ముకునేందుకు ప్రయత్నించింది. ఆనాడు బీజేపీ తరఫున అన్ని రకాలుగా పోరాటం చేశాం” అని అన్నారు.
కాంగ్రెస్ ధర్నాలు సిగ్గుచేటు..
స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను రాహుల్, సోనియా గాంధీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి దొడ్డిదారిన బదలాయించుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేస్తే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య అని ఫైర్ అయ్యారు. ‘‘నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశం తప్ప.. సేవ చేయాలనే ఉద్దేశం లేదు. బోఫోర్స్ కుంభకోణం నుంచి నేషనల్ హెరాల్డ్ వరకు కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే. నేషనల్ హెరాల్డ్ కేసు కొత్తగా బీజేపీ సర్కార్ తెచ్చింది కాదు. దీనిపై 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సుబ్రమణ్యస్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కొట్టేయాలని సోనియా, రాహుల్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే... కోర్టులు తోసిపుచ్చాయి. కోర్టుకు, ఈడీకి సహకరించాల్సింది పోయి.. దబాయించేందుకు ప్రయత్నించడం సరికాదు. ఈడీ, కేంద్రప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేసినంత మాత్రాన.. చేసిన అవినీతి, అక్రమాలు సమసిపోవు” అని అన్నారు.