
- ప్రధాని మోదీ కులంపై అవాకులు.. చవాకులా?: కిషన్‌రెడ్డి
- ఆయన అసహనంతో మాట్లాడుతున్నారని ఫైర్
- రాహుల్ ది ఏ కులం? ఏ మతం? : బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ బీసీనా? కాదా? అనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో కూడుకున్నవని విమర్శించారు. ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం కిషన్‌రెడ్డి స్పందించారు. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో సీఎం హోదాలో ఉన్న విషయాన్ని మరిచిపోయి.. నోటికొచ్చినట్లు అవాకులు, చవాకులు పేలతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజురోజుకూ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పట్టుకోల్పోతున్న నేపథ్యంలో అసహనంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారానికి దూరమవడం, ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ గుండుసున్నాలతో అవమానం పాలవడాన్ని తట్టుకోలేక సీఎం అసహనం కట్టలు తెంచుకున్నదని ఎద్దేవా చేశారు. సామాజిక సమరసత విషయంలో బీజేపీకి, ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పారు. బీసీ కులగణన సర్వే నిర్వహించి, తమకు అన్యాయం చేశారని బీసీ సంఘాలే విమర్శలు చేస్తున్నాయని, దీని నుంచి తప్పించుకోవడానికి మోదీపై రేవంత్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లపై దారి మళ్లించేందుకే : సంజయ్
రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారని, ఆయన మతమేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘ఆయన కులం, మతం ఏంటో రాహుల్‌కే తెలియదా? లేక మీకు తెలియదా?’’ అని రేవంత్‌ను అడిగారు. రాహుల్తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని, హిందూ సంప్రదాయంలో తండ్రి ద్వారా కులం వస్తుందని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని దారి మళ్లించేందుకే ప్రధాని మోదీ కులంపై కాంగ్రెస్ రచ్చ చేస్తున్నదని విమర్శించారు. మోదీ కులంపై కాంగ్రెస్ రీసెర్చ్ ఫెయిలయిందని, 1994లో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే మోదీ ఓబీసీగా ఉన్నారనే విషయాన్ని మరిచిపోయారని పేర్కొన్నారు. ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే అంశంపై చర్చ చేయాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి.. 10 జనపథ్ నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ మొదటి నుంచి ఒకే స్టాండ్ పై ఉందని, అదే స్టాండ్ ను కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
రేవంత్ ఖబర్దార్: ఏలేటి
ప్రధాని మోదీనుద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ ధ్వజమెత్తారు. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావని హెచ్చరించారు. రేవంత్ పదవిని కాపాడుకునేందుకు మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీసీ ప్రధానిగా ఉండటం ఓర్వలేకే గతంలో మోదీపై రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారని, రాహుల్ బాటలోనే రేవంత్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
పోయేకాలం వచ్చింది : ఈటల
సీఎం రేవంత్ రెడ్డికి పోయేకాలం వచ్చిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. గతంలో కేసీఆర్ కండ్లు నెత్తికెక్కి మోడీ, గీడీ అని మాట్లాడారని గుర్తుచేశారు. మోదీని తిడితే ఏమైతుందో కేసీఆర్ కు తెలిసిందని, త్వరలో రేవంత్ కు కూడా తెలిసివస్తుందన్నారు. మోదీని రేవంత్ తమ పెద్దన్న అంటూనే..ఇప్పుడు బీసీ కాదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానితో గొక్కోవడమంటే ధర్మం, ప్రజలతో గోక్కోవడమేననే విషయం రేవంత్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు.