మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే.. ప్రజలకు కేసీఆర్ చిప్ప పెట్టడం ఖాయం

మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే..  ప్రజలకు  కేసీఆర్ చిప్ప పెట్టడం ఖాయం

దేశంలో అత్యంత అవినీతి, నియంతృత్వ పార్టీ బీఆర్ఎస్ అన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్..రాష్ట్ర ప్రజల రక్తంతో విమానాలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఏమైంది..ఒక కుటుంబం చేతిలో బంది అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసిఆర్ కుటుంబంలో రాష్ట్రం కోసం బలిదానాలు చేశారా అని నిలదీశారు. 

తెలంగాణలో  నిజాం పాలన కొనసాగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. మజ్లిస్ పార్టీ చేతిలో చిక్కిందని మంపడ్డారు. కేసిఆర్, అసదుద్దీన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు  ఓటుస్తే కాంగ్రెస్కు వేసినట్లేనని.. కాంగ్రెస్ కు ఓటుస్తే మజ్లిస్ కు వేసినట్లేనని చెప్పారు. ఎంఐఎం పార్టీది రజాకార్ల వారసత్వం అని చెప్పారు. 

రాష్ట్రంలో మద్యం వేలం డబ్బుతో, ORR వేలంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి వాపోయారు. మరో సారి బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల చేతిలో కేసీఆర్ చిప్ప పెట్టడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బీఆర్ఎస్ కు  బుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే..గెలిచిన వాళ్లంతా మళ్లీ బీఆర్ఎస్ లో చేరుతారని జోస్యం చెప్పారు. 

బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.  తెలంగాణ ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామన్నారు. కుటుంబ పాలన లేకుండా చేస్తామని చెప్పారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం కోసం పని చేసే పార్టీకి ఓటు వేయాలా... కుటుంబ పార్టీకి ఓటు వేయాలా ప్రజలు ఆలోచన చేయాలన్నారు.