18 రాష్ట్రాలలో గిరిజనులకు న్యాయం జరగలేదని.. గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు దిశగా పీఎం జన్మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. జనవరి15వ తేదీ సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్య నగర్ లో నిర్వహించిన జన్మన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ఆదివాసి ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 25 వేల కోట్ల రూపాయలను ఈ కార్యక్రమానికి కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. 45 రోజుల క్రితమే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందని.. ఆదివాసులకు ఇల్లు నిర్మాణం కోసం నేరుగా నిధులు మంజూరు చేశామన్నారు. ఆధార్, రేషన్ కార్డు, విద్యుత్, అంగన్వాడి భవనం, ఆరోగ్య భద్రత వంటి కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు.
జిల్లాలోని అనంతగిరి ప్రాంతానికి రూ.100 కోట్ల నిధులతో పర్యాటక అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండడంతో ఐటీ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తుంటారని.. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా స్వదేశీ దర్శన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందన్నారు. సందర్శన కోసం కాటేజీలో పార్కుల నిర్మాణం, సైకిల్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.