ప్రపంచం అబ్బురపడేలా మోదీ పరిపాలన: కిషన్ రెడ్డి

గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం అబ్బుర పడేలా మోదీ.. నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి ఎంతో సహకరించారని చెప్పారు. తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. దేశంలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారని.. ప్రధాని మోదీ పాలనలో 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన చెప్పారు.

తెలంగాణలో సమ్మక్క- సారమ్మ పేరుతో జాతీయ గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు కిషన్ రెడ్డి. తెలుగు భాషపై మోదీకి ఎనలేని గౌరవం ఉందని... తెలుగు ప్రజలతో మోదీ మమేకమై పని చేస్తున్నారన్నారు. మోదీ స్వయంగా తెలుగు మాట్లాడుతూ.. మన భాషను ప్రోత్సహిస్తున్నారని చెప్పారాయన. తెలంగాణ సమాజం మోదీకి అండగా ఉండాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఆశీర్వదించి 17 కు 17 చోట్ల బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. 

ALSO READ | తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా

ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ రూ. వేల కోట్ల దోపిడి చేసిందని విమర్శించారు. ఈ దోపిడి సరిపోదని.. కవిత లిక్కర్ వ్యాపారంలో కుంబకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు.  తెలంగాణ తలదించుకునే పరిస్థితి తెచ్చారని ఫైరయ్యారు. కుక్క తోక వంకర అన్నట్లుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మళ్లీ అవినీతి కార్యక్రమాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటిలతో ప్రజలను మోసం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.