కేంద్రంలో కిషన్​రెడ్డికి రెండోసారి చాన్స్​!

కేంద్రంలో కిషన్​రెడ్డికి రెండోసారి చాన్స్​!
  • మరోసారి తన కేబినెట్​లోకి తీసుకున్న మోదీ

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో కొలువుదీరిన మోదీ ప్రభుత్వంలో మరోసారి హైదరాబాద్​నగరానికి ప్రాధాన్యత లభించింది. ఎంపీగా రెండోసారి విజయం సాధించిన కిషన్​రెడ్డిని.. మోదీ మరోసారి తన కేబినెట్​లోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్​రెడ్డి 2019లో జరిగిన పార్లమెంట్​ఎన్నికల్లో మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్​ఎన్నికల్లోనూ సికింద్రాబాద్​ స్థానం నుంచి రెండోసారి గెలుపొందారు.  మొదటిసారి గెలిచినప్పుడు కిషన్​రెడ్డికి  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి లభించింది.

మంత్రివర్గ విస్తరణలో కేంద్ర టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2019 మే 30 నుంచి 2021 జులై 7  వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన పనిచేశారు. 2024 సాధారణ ఎన్నికల వరకు కూడా ఆయన టూరిజం శాఖ మంత్రిగానే కొనసాగారు. మంత్రిగానే కాకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు సాధించడంలో కిషన్​రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

 కేంద్ర మంత్రి అయినా హైదరాబాద్​గల్లీగల్లీలో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకునే నేతగా కిషన్​రెడ్డికి మాస్​ఫాలోయింగ్​వుంది. మరోసారి ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించడంతో గ్రేటర్​హైదరాబాద్​ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.