కాపాడండి: సింగరేణి డస్ట్​ తో చాలా ఇబ్బంది పడుతున్నాం

కాపాడండి: సింగరేణి  డస్ట్​ తో చాలా ఇబ్బంది పడుతున్నాం
  • మంత్రి తుమ్మలకు కిష్టారం గ్రామస్తుల వినతి 
  • బొగ్గు గనులతో ప్రాణాలు పోతున్నాయని ఆందోళన  

దమ్మపేట/సత్తుపల్లి/ కల్లూరు/వెంసూరు  :  సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ కాలనీవాసులు సింగరేణి బొగ్గు గనులతో తమ కాలనీకి అన్యాయం జరుగుతోందని, ప్రాణాలు పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. శైలో బంకర్ నుంచి వస్తున్న డస్ట్ తో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి  మంత్రి స్పందిస్తూ ఎన్నికల కోడ్ తర్వాత సింగరేణి ఎండీ, ఇతర అధికారులు, సత్తుపల్లి ఎమ్మెల్యేతో కలిసి కాలనీని పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. సొసైటీ చైర్మన్ల పదవీ కాలాన్ని  రాష్ట్ర ప్రభుత్వం పెంచడంతో  మంత్రిని సొసైటీ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్లు శాలువాలతోఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎర్ర జవహర్ లాల్ ఇటీవల అస్వస్థతకు గురవడంతో శనివారం రాత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ద్వారకాపురి కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి  పరామర్శించారు.  

 డిసెంబర్ కల్లా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పూర్తి...

డిసెంబర్ నాటికి కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. గండుగులపల్లిలో మంత్రిని వెంసూరు మండలం కల్లూరుగూడెం రైతులు కలిశారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ డిలే అయిందని, కోడ్ ముగియగానే ఫ్యాక్టరీ పనులపై సమీక్షిస్తామని తెలిపారు.