సంగారెడ్డి జిల్లాలో హైడ్రా ఆపేనా..?

సంగారెడ్డి జిల్లాలో హైడ్రా ఆపేనా..?
  • కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో రూ.20 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా
  • మూడేళ్లుగా నిర్మాణాలు చేస్తున్నా.. నో యాక్షన్
  • అడిషినల్ ​కలెక్టర్ ​ఆపినాఆగని ఆక్రమణలు
  • ప్రభుత్వ సూచిక బోర్డులకు గుడ్డలు కట్టి నిర్మాణాలు

సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో కొందరు దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఏకంగా కిష్టారెడ్డిపేట ఈద్గా ముందు ఉన్న దాదాపు రూ.20 కోట్ల విలువైన స్థలానికి ఎసరు పెట్టారు. పక్కనున్న ప్రైవేట్ సర్వే నంబర్ల డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ సర్వే నంబర్ లోని అర ఎకరా స్థలాన్ని ఆక్రమించి మూడేళ్లుగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. హైడ్రా ఎంట్రీతోనైనా ఈ ఆక్రమణలు ఆగాలని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

సూచిక బోర్డులకు గుడ్డలు కట్టి..

సర్వే నంబర్ 164లో దర్గా వద్ద కొనసాగుతున్న నిర్మాణాలు అక్రమమని నాలుగు నెలల కింద అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తేల్చారు. ఆయన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కొంత మేర నిర్మాణాలను కూల్చేసి ఆ స్థలంలో ఇది ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. కబ్జాదారులు ఆ సూచిక బోర్డుకు గుడ్డలు కట్టి దర్జాగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అధికారుల చర్యలకు ముందు మూడు ఫ్లోర్లు మాత్రమే వేసిన సదరు ఆక్రమణదారులు తర్వాత మరో రెండు ఫ్లోర్లు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

హైదరాబాద్​కు చెందిన ఓ మహిళా ఐపీఎస్​ ఆఫీసర్​ తన బంధువని ఆక్రమణదారుల్లో ఒకరు ప్రచారం చేసుకోవడంతో నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా అధికారులు జంకుతున్నారు. అమీన్​పూర్, కిష్టారెడ్డిపేటలో కొనసాగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో ఇలా అధికారులు, లీడర్ల సపోర్ట్​తో ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో భారీ నిర్మాణాలు, బహుళ అంతస్తులో వ్యాపార సముదాయాలు వెలిశాయి.

కిష్టారెడ్డిపేట ఆక్రమణ గురించి గతంలో "వెలుగు" పత్రికలో  రావడంతో అధికారులు సర్వే చేసి అది ప్రభుత్వ భూమిగా తేల్చారు. ఆ నిర్మాణానికి పర్మిషన్లు రద్దు చేసి ముగ్గురిపై క్రిమినల్​ కేసులు నమోదు చేయించారు. అనంతరం మూడు పర్యాయాలు అక్కడి నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. కానీ కొద్ది రోజుల్లోనే మళ్లీ అక్కడ నిర్మాణాలు మొదలయ్యాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

హైడ్రాపైనే ఆశలు

ప్రభుత్వ భూములు, చెరువులు వాటి పరివాహాక ప్రాంతాల పరిరక్షణ కోసం ముందుకు వెళ్తున్న హైడ్రా పైనే కిష్టారెడ్డిపేట వాసులు ఆశలు పెట్టుకున్నారు. ఈద్గా ముందున్న ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నా జిల్లా అధికారులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైడ్రా అమీన్​పూర్​ పరిధిలో పలు ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుండడంతో కిష్టారెడ్డిపేట ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈద్గా వద్ద కొనసాగుతున్న ఆక్రమణలను స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్​ స్పందించి కిష్టారెడ్డిపేట నిర్మాణాలను కూల్చివేయాలని కోరుతున్నారు.