
ఏ సీజన్లో వచ్చే కూరగాయలు ఆ సీజన్లో తింటే ఆరోగ్యానికి చాలామంచిది. ఈ సీజన్లో చిక్కుడుకాయలతో కూర లేదా ఫ్రై చేసుకుని తినడం మామూలే. అదే చిక్కుడు కాయలతో రోటి పచ్చడి, నిల్వ పచ్చడి, ఆవిరి కుడుములు, కోడిగుడ్డు పొరటు అంతెందుకు మటన్‌తో కలిపి వండారనుకోండి. వెరైటీగా ఉండటమే కాదు టేస్టీగా కూడా ఉంటుంది.
రోటి పచ్చడి
కావాల్సినవి :
చిక్కుడు కాయలు : పావు కిలో
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
టొమాటోలు : మూడు
ఉప్పు : సరిపడా
వెల్లుల్లి రెబ్బలు : ఐదు
ఎండు మిర్చి : రెండు
ధనియాల పొడి, కారం, చింతపండు : ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
తయారీ :ఒక పాన్‌లో నూనె వేడి చేసి అందులో చిక్కుడు కాయలు, టొమాటోలు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేగించాలి. అవన్నీ వేగాక ధనియాల పొడి, చింతపండు, కారం వేసి కలపాలి. వాటన్నింటినీ రోట్లో వేసి మెత్తగా దంచాలి. వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు!
చిక్కుడుకాయ రసవంగి
కావాల్సినవి :
చిక్కుడు కాయలు - పావుకిలో
టొమాటోలు - రెండు
నీళ్లు, ఉప్పు, నూనె - సరిపడా
అల్లం తురుము, బెల్లం పొడి, ఆవాలు - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
పల్లీలు - అర కప్పు
పసుపు, ఇంగువ - ఒక్కోటి పావు టీస్పూన్
కందిపప్పు (ఉడికించిన) - రెండు కప్పులు
ఎండు మిర్చి - నాలుగు
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
పచ్చి శనగ పప్పు, మిరియాలు - ఒక్కో టీస్పూన్
చింతపండు (నానబెట్టిన), కరివేపాకు, కొత్తిమీర - కొంచెం, పచ్చి కొబ్బరి - ఒక కప్పు
తయారీ : ఒక పాత్రలో నీళ్లు పోసి, చిక్కుడు కాయలు, టొమాటో ముక్కలు, అల్లం తురుము, బెల్లం పొడి, పల్లీలు, పసుపు, ఉడికించిన కందిపప్పు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి, ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, నానబెట్టిన చింతపండు, పచ్చి కొబ్బరి వేసి వేగించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ని ఉడుకుతున్న చిక్కుడు కాయల మిశ్రమంలో వేసి కలపాలి. గిన్నె మీద మూతపెట్టి మరికాసేపు ఉడికించాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేయాలి. దీన్ని కూడా చిక్కుడు కాయల మిశ్రమంలో కలపాలి. చివర్లో కొత్తిమీర చల్లితే వేడి వేడి చిక్కుడు కాయ రసవంగి రెడీ.
ఆవకాయ
కావాల్సినవి :
చిక్కుడు కాయలు : అర కేజీ
ఆవాలు : మూడు టేబుల్ స్పూన్లు
మెంతులు : ఒక టేబుల్ స్పూన్
చింతపండు : వంద గ్రాములు
వేడి నీళ్లు : ఒక కప్పునువ్వుల నూనె : పావు లీటర్
కారం : ముప్పావు కప్పు
ఉప్పు : పావు కప్పు
పసుపు : అర టీస్పూన్తాలింపు కోసం..
జీలకర్ర : ఒక టీస్పూన్
ఆవాలు : రెండు టేబుల్ స్పూన్లు
మెంతులు : పావు టీస్పూన్
ఎండుమిర్చి : నాలుగు
కరివేపాకు : కొంచెం
వెల్లుల్లి రెబ్బలు : పావు కప్పు
ఇంగువ : పావు టీస్పూన్
తయారీ : చిక్కుడు కాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటి ఈనెలు తీసేయాలి. చింతపండులో వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. మెంతులు, ఆవాలు నూనె లేకుండా వేగించి, మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో నువ్వుల నూనె వేడి చేయాలి. అందులో చిక్కుడు కాయలు వేసి వేగించి పక్కన పెట్టాలి. అదే గిన్నెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు , వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేగించాలి. ఆ తాలింపును వేగించిన చిక్కుడు కాయల మీద వేయాలి. మరో గిన్నెలో వందగ్రాముల నూనె వేడిచేసి అందులో నానబెట్టిన చింతపండు గుజ్జు పోసి కలపాలి. పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉంచాలి. ఆ తర్వాత ఒక పెద్ద పాత్రలో చిక్కుడు కాయల మిశ్రమం, చింతపండు గుజ్జు మిశ్రమం, కారం, ఉప్పు, పసుపు, రెడీ చేసిపెట్టిన ఆవాలు–మెంతుల పొడి వేసి బాగా కలిపితే నోరూరించే చిక్కుడు కాయ ఆవకాయ రెడీ.
చిక్కుడు - కోడిగుడ్డు పొరటు
కావాల్సినవి :
చిక్కుడు కాయలు - పావుకిలో
ఆలుగడ్డలు - రెండు
కోడిగుడ్లు - ఐదు
నూనె, ఉప్పు - సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - ఏడు
ఉల్లి గడ్డ తరుగు - ఒక కప్పు
కొత్తిమీర, కరివేపాకు - కొంచెం
పసుపు - అర టీస్పూన్
ఆవాలు, జీలకర్ర, కారం, ధనియాల పొడి - ఒక్కో టీస్పూన్
టొమాటో తరుగు - అర కప్పు
తయారీ : పాన్‌లో నూనె వేడి చేసి ఆలుగడ్డ తరుగు, ఉప్పు వేసి వేగించాలి. తర్వాత అందులో చిక్కుడు కాయలు వేసి కలపాలి. అవి కూడా వేగాక అవన్నీ తీసి పక్కన పెట్టాలి. వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి మిక్సీ పట్టి పేస్ట్‌లా చేయాలి. మరో పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఉల్లి గడ్డ తరుగు, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన గుజ్జు, టొమాటో తరుగు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. అవన్నీ బాగా కలిశాక, అందులో వేగించిన చిక్కుడుకాయలు, ఆలుగడ్డ కూడా వేసి కలపాలి. చివరిగా కోడిగుడ్ల సొన వేసి, కాసేపు వేగించాక కొత్తిమీర చల్లాలి.
కుడుములు : కావాల్సినవి ..
చిక్కుడు కాయలు - పావు కప్పు
నీళ్లు, నూనె, ఉప్పు - సరిపడా
జీలకర్ర - ఒక టీస్పూన్
నువ్వులు - మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లికాడలు - రెండు
పచ్చి కందులు - పావు కప్పు
కొత్తిమీర, కరివేపాకు - కొంచెం
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
బియ్యప్పిండి - ఒక కప్పు
తయారీ : ఒక గిన్నెలో నీళ్లు వేడి చేయాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి, జీలకర్ర, నువ్వులు, ఉల్లికాడలు, పచ్చి కందులు, చిక్కుడు గింజలు వేగించాలి. అందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా కలపాలి. ఆ తర్వాత వేడి నీళ్లు పోసి, ఉప్పు, బియ్యప్పిండి కలపాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి, అందులో రెడీ చేసిన మిశ్రమాన్ని వేయాలి. ఇడ్లీ ప్లేట్లను పాత్రలో పెట్టి, మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి.