కిచెన్ తెలంగాణ.. ఎగ్​ వెరైటీ రెసిపీలు

కిచెన్ తెలంగాణ.. ఎగ్​ వెరైటీ రెసిపీలు

కోడిగుడ్డు వద్దే వద్దు అని మారాం చేసే పిల్లలకు.. ఆటపాటలు, చదువుల్లో మునిగి తేలుతున్న టీనేజర్స్​కి.. ఇన్​స్టంట్​ ఎనర్జీ కోసం వయసులో పెద్ద వాళ్లకు.. అందరికీ నచ్చే ఎగ్​ వెరైటీ రెసిపీలు ఈ వారం స్పెషల్. ​ అక్టోబర్​ 13న వరల్డ్​ ఎగ్​ డే కూడా!  అందుకే రుచితోపాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ స్పెషల్​ వంటకాలు ట్రై చేయండి.

ఎగ్ లాలిపాప్

కావాల్సినవి :

 కోడిగుడ్లు : ఏడు

ఉల్లిగడ్డ : ఒకటి

పచ్చిమిర్చి : మూడు

కారం, ధనియాల పొడి, అల్లం తురుము : ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున

ఉప్పు, బ్రెడ్ పొడి, నూనె : సరిపడా

పసుపు : అర టీస్పూన్

కొత్తిమీర తరుగు : కొంచెం

మైదా : అర కప్పు

తయారీ :  ఆరు కోడిగుడ్లు ఉడకబెట్టాలి. తర్వాత పొట్టు తీసి, సన్నగా తురమాలి. అందులో అల్లం తురుము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, మైదా లేదా గోధుమపిండి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం ముద్దగా అయ్యాక చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక చిన్న గిన్నెలో ఒక కోడిగుడ్డు సొన వేసి గిలక్కొట్టాలి. అందులో తయారుచేసిన ఉండల్ని ముంచి, తర్వాత బ్రెడ్​ పొడిలో దొర్లించాలి. వాటిని వేడి వేడి నూనెలో వేసి బ్రౌన్​ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. వాటిని టొమాటో కెచెప్​లో కలిపి తింటే భలే ఉంటుంది టేస్ట్​.

ఇన్​స్టంట్​ నూడిల్స్ ఆమ్లెట్

కావాల్సినవి :

కోడిగుడ్లు : నాలుగు

ఇన్​స్టంట్ నూడిల్​ ప్యాకెట్స్​ : నాలుగు

ఉల్లిగడ్డ, టొమాటో : ఒక్కోటి

క్యాప్సికమ్స్ : రెండు

ఉప్పు, నూనె : సరిపడా

వేడి నీళ్లు : ఒకటిన్నర కప్పు

మిరియాల పొడి : 

ఒకటిన్నర టీస్పూన్ 

చీజ్ : కొంచెం

తయారీ : ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి, అందులో కారం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఒక పాన్​లో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, టొమాటో తరుగు, కారం, ఉప్పు వేసి బాగా వేగించాలి. తర్వాత అందులో వేడి నీళ్లు పోసి, ఇన్​స్టంట్​ నూడిల్స్ వేసి, మిరియాల పొడి చల్లాలి. మూత పెట్టి చిన్న మంట మీద కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత అందులో కోడిగుడ్ల సొన మిశ్రమాన్ని నూడిల్స్​ మీద పోయాలి. పైన చీజ్​ చల్లి, మూత పెట్టి మరికాసేపు ఉడికించాలి.

క్రిస్పీ ఎగ్ ఫింగర్స్

కావాల్సినవి :

కోడిగుడ్లు : ఆరు

ఉప్పు : పావు టీస్పూన్

కారం, మిరియాల పొడి : ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

ఉల్లిగడ్డ : ఒకటి

పచ్చిమిర్చి పేస్ట్ : అర టేబుల్ స్పూన్

పాలు : పావు కప్పు

మైదా : అర కప్పు

బ్రెడ్ పొడి : ఒక కప్పు

తయారీ : ఒక గిన్నెలో ఐదు కోడిగుడ్లు, ఉప్పు, కారం, మిరియాల పొడి, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్​లో నూనె రాసి, అందులో కోడిగుడ్డు మిశ్రమం పోయాలి. ఒక పాన్​లో నీళ్లు పోసి వేడిచేయాలి. అందులో కోడిగుడ్ల మిశ్రమం ఉన్న ప్లేట్​ పెట్టి, పాన్​ పై మూత పెట్టాలి. పావుగంట ఉడికించి, ఆ తర్వాత తీసి చాకుతో పొడవుగా కట్ చేయాలి. ఒక చిన్న గిన్నెలో ఒక కోడిగుడ్డు సొన కార్చి అందులో పాలు పోసి బాగా కలపాలి. రెడీ చేసుకున్న ఫింగర్స్​ని మైదా పిండిలో అద్ది కోడిగుడ్డు సొనలో ముంచాలి. ఆ తర్వాత బ్రెడ్​ పొడిలో దొర్లించాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి అందులో ఎగ్​ ఫింగర్స్​ని వేసి వేగించాలి.

ఎగ్ స్నాక్

కావాల్సినవి :

నూనె : ఒకటిన్నర టేబుల్ స్పూన్

మైదా, పాలు : ఒక్కో కప్పు

కోడిగుడ్లు : ఐదు

ఉల్లిగడ్డలు : రెండు

కారం, చికెన్ మసాలా, టొమాటో కెచెప్, అల్లం, వెల్లుల్లి తరుగు, నీళ్లు : ఒక్కో టీస్పూన్ చొప్పున

టొమాటో, క్యాప్సికమ్ : ఒక్కోటి

పచ్చిమిర్చి : రెండు

ధనియాల పొడి : అర టీస్పూన్

పసుపు : పావు టీస్పూన్

ఉప్పు : సరిపడా

తయారీ : నాలుగు కోడిగుడ్లను ఉడకపెట్టి, పొట్టు తీయాలి. తరువాత వాటిని నిలువుగా కట్ చేయాలి. పాన్​లో టీస్పూన్ నూనె, చిటికెడు పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లను అందులో   వేగించాలి. మరో పాన్​లో నూనె వేసి అల్లం– వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు వేసి వేగించాలి. తర్వాత క్యాప్సికమ్, టొమాటో తరుగు కూడా వేయాలి. అవి వేగాక అందులో కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి వేగించాలి. అందులో నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత టొమాటో కెచెప్, కొత్తిమీర వేసి కలపాలి.  మిక్సీజార్​లో మైదా, ఒక గుడ్డు సొన వేసి అర కప్పు పాలు పోసి బ్లెండ్​ చేయాలి. తర్వాత మిగతా పాలు పోసి, ఉప్పు, నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోయాలి. ఒక పాన్​లో మొత్తం నూనె రాసి అందులో ఈ మిశ్రమాన్ని గరిటెతో దోశలా పోయాలి. సన్న మంట మీద రెండు వైపులా కాల్చాలి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్​లో పెట్టి అందులో రెడీ చేసిన స్టఫింగ్, కోడిగుడ్డు కూడా​ పెట్టాలి. మైదా పిండిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని చివర్లకు రాసి నాలుగు వైపులా మడతపెట్టాలి. వాటిని వేడి నూనెలో రెండు వైపులా వేగిస్తే టేస్టీగా ఉండే ఢిఫరెంట్​ ఎగ్ స్నాక్ రెడీ. 

ఎగ్​ సమోస

కావాల్సినవి :

కోడిగుడ్లు : ఐదు 

నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి తరుగు : ఒక టీస్పూన్

ఉల్లిగడ్డ, ఉల్లికాడల తరుగు : 

ఒక్కో టేబుల్ స్పూన్

ఉప్పు : సరిపడా

కారం, ధనియాల పొడి, గరం మసాలా : ఒక్కోటి పావు టీస్పూన్

కొత్తిమీర తరుగు : కొంచెం

మయోనైజ్​ : కొంచెం

తయారీ :  రెండు కోడిగుడ్లు ఉడికించి, పొట్టు తీయాలి. ఒక గిన్నెలో మూడు కోడిగుడ్ల సొన వేసి అందులో కారం, ఉప్పు వేసి కలపాలి. పాన్​లో నెయ్యి వేడి చేసి గుడ్డు  మిశ్రమం పోసి ఆమ్లెట్​లా వేయాలి. అలా మూడు ఆమ్లెట్​లు వేసి ఒక్కోదాన్ని రెండు భాగాలుగా కట్ చేయాలి. తర్వాత అదే పాన్​లో మరోసారి నెయ్యి వేడి చేసి అందులో ఉల్లిగడ్డ, ఉల్లికాడలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు, ఉడికించిన కోడిగుడ్లను తురిమి అందులో వేసి బాగా కలపాలి. రెడీ చేసిన ఆమ్లెట్​లపై మయోనైజ్​​ పూసి సమోసాలా చుట్టాలి. అందులో రెడీ చేసిన స్టఫింగ్ పెట్టి మూసేయాలి.