- విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూళ్లకు నిధుల కేటాయింపు
- మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు త్వరలో కొత్త గిన్నెలు సరఫరా
- జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో టెండర్ నోటిఫికేషన్లు జారీ
- కరీంనగర్, సిరిసిల్లలో త్వరలో నోటిఫికేషన్?
కరీంనగర్, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండే కిచెన్లకు కొత్త సామగ్రి రానుంది. ఏళ్ల తరబడి పాత వంట పాత్రల్లోనే వండుతుండడంతో అవి ఇప్పటికే అరిగిపోవడమేగాక సొట్లు పడుతున్నాయి. గిన్నెలు, గంజులు పలుచగా ఉండడం వల్ల కూరలు, అన్నం మాడిపోతున్నాయని మిడ్ డే కార్మికులు చెబుతున్నారు. అంతేగాక వాటిలో వండిన వంట కూడా రుచిగా ఉండడం లేదనే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు చాలా కాలంగా చెప్తున్నారు. చాలా చోట్ల ప్రభుత్వం సరఫరా చేసిన వంట పాత్రలు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తమ సొంత పాత్రల్లో వండుతున్నారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని స్కూళ్లకు వంట పాత్రలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వంట పాత్ర కొనుగోలుకు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వగా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నోటిఫికేషన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిధులు కేటాయించింది. 10 మంది లోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు నిధులు కేటాయించలేదు. 10కిపైగా 50 మందిలోపు విద్యార్థులు స్కూళ్లకు రూ.10 వేలు, 51 నుంచి 150 మంది ఉంటే రూ.15 వేలు, 151-–250 ఉంటే రూ.20 వేలు, 250 కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలలకు రూ.25 వేలు కేటాయించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో 470 స్కూళ్లు, పెద్దపల్లి జిల్లాలో 389 స్కూళ్లు, జగిత్యాల జిల్లాలో 500కుపైగా స్కూళ్లు ఉన్నాయి.
కొనుగోలు చేసే వంట సామగ్రి ఇవే...
అన్నం, కర్రీ/సాంబార్ వండడానికి బగోనా(పెద్ద గిన్నె)లు, వడ్డించడానికి స్టీల్ బేసిన్లు, ఇంగ్రీడియెంట్స్ కు స్టీల్ కంటైనర్లు, కర్రీ వడ్డించడానికి స్టీల్ బకెట్లు, అన్నం, కర్రీ వడ్డించడానికి స్టీల్ స్పూన్లు, అన్నం వడ్డించడానికి ఉపయోగించే కబ్ గిర్లు కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు కోసం ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు చైర్మన్ గా డీఈఓ, సివిల్ సప్లై ఆఫీసర్, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ సభ్యులుగా పర్చేజింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు.