హైదరాబాద్ సిటీ, వెలుగు: అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల13 నుంచి 15 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. మూడ్రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 19 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళి కైట్ క్లబ్ సభ్యులు పాల్గొననున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించనున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించనున్న ఈ ఫెస్టివల్‌కు సాధారణ సందర్శకులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా తెలంగాణ సంప్రదాయ వంటలు, పంజాబ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన రకరకాల స్వీట్లను ఫుడ్ కోర్టుల్లో ప్రదర్శించి, విక్రయించనున్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దాదాపు 15 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లను పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫెస్టివల్ ఏర్పాట్లను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గతేడాది కంటే ఈసారి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆ దిశగా ఏర్పాట్లు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
స్టేజ్, ఫుడ్ కోర్ట్, స్టాల్స్‌ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 99481 39909 నంబరులో సంప్రదించాలని కోరారు.