హాలియా, వెలుగు: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ను గురువారం పలు దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ సందర్శించి సందడి చేశారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని మూడురోజుల పాటు సికింద్రాబాద్ లో కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. దీనికి దేశంలోని14 రాష్ట్రాల నుంచే కాకుండా జపాన్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, వియత్నం, శ్రీలంక, పోలాండ్, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, ఉక్రెయిన్ వంటి 20 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ తరలివచ్చారు. గురువారం కైట్ ఫ్లయర్స్ సాగర్ ను సందర్శించి.. బుద్ధవనంలోని మహా స్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరం, బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్తూప వనాలను తిలకించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాంసన్, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టూరిజం లాంచీలో నాగార్జున కొండకు వెళ్లారు. టూరి జం అధికారులు లోకేశ్, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.