ధూల్​పేట్ లో పతంగుల సందడి .. గతంతో పోల్చితే 20 శాతం పెరిగిన బిజినెస్​

ధూల్​పేట్ లో పతంగుల సందడి .. గతంతో పోల్చితే 20 శాతం పెరిగిన బిజినెస్​
  • రూపాయి నుంచి రూ.5 వేల వరకు పతంగుల ధరలు  
  • దేశీయ మాంజాలకే సై.. చైనా మాంజాలకు నో

హైదరాబాద్ సిటీ, వెలుగు: సంక్రాంతి వచ్చిందంటే పిల్లలతో పాటు యూత్​కు కైట్స్ పైనే క్రేజంతా. సిటీలో ముఖ్యంగా ధూల్​పేట్, మంగళహాట్ ప్రాంతాల్లో పండగకు మూడు నెలల ముందు నుంచే అమ్మకాలు షురూ అయ్యాయి. ఒక్క రూపాయి నుంచి మొదలుకుంటే రూ.5 వేల వరకు రకరకాల డిజైన్లలో పతంగులు, రూ. 5 నుంచి మొదలయ్యే ప్లాస్టిక్​చర్కాలతో పాటు రూ.250 పలికే కర్ర చర్కాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఈసారి వివిధ రంగుల్లో, అభిమాన హీరోలు, లీడర్లు, కార్టూన్ క్యారెక్టర్స్, జంతువుల బొమ్మలతో వెరైటీ కైట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సీజన్​లో ధూల్​పేట్ ​నుంచి పక్క రాష్ట్రాలకు కూడా పతంగులు ఎక్స్​పోర్ట్  చేస్తున్నారు. 

20 శాతం పెరిగిన బిజినెస్

గతేడాదితో పోల్చుకుంటే ఈసారి బిజినెస్​ పెరిగిందని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు.  సిటీలో పతంగుల అమ్మకాలు అక్టోబర్​లో మొదలవుతాయి. దీంతో ఇప్పటివరకు తయారు చేసిన స్టాక్ దాదాపు అయిపోవస్తున్నది. పండుగ దగ్గరపడే కొద్దీ షాపుల్లో రద్దీ పెరిగిపోతుండడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి బిజినెస్ 20 శాతం పెరిగిందని ధూల్​పేట, మంగళ్​హాట్ వ్యాపారులంటున్నారు. ఇప్పుడైతే పెద్దగా రేట్లు పెరగలేదని, పిల్లలకు సెలవులు ఇచ్చాక ధరలు పెరిగే అవకాశంఉందని కొనేవారంటున్నారు.  

గుడుంబా వదిలి.. సీజనల్​ వ్యాపారం వైపు..

ధూల్​పేట్, మంగళ్​హాట్​లో ఒకప్పుడు గుడుంబా, నాటుసారా, గంజాయి అమ్మేవారు. ఎక్సైజ్ పోలీసుల చొరవతో ఆ దందా బంద్ చేసి సీజనల్ వ్యాపారం వైపు దృష్టి సారించారు. అందులో భాగంగానే సంక్రాంతి సీజన్​లో పతంగులు, మాంజాలు, వినాయక చవితి టైంలో గణేశుడి విగ్రహాలు, రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు, హోలీ సందర్భంగా రంగులు, పత్తాలు తయారు చేసి జీవనోపాధి పొందుతున్నారు. ఈ రెండు ఏరియాల్లో సుమారు 100 నుంచి 150 కుటుంబాలు ఇలా ఉపాధి పొందుతున్నాయి.  

నో చైనా మాంజా.. కాటన్​ మాంజాలే 

ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుండడంతో చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇక్కడి వ్యాపారులు సైతం తాము చైనా మాంజా విక్రయించడం లేదంటున్నారు. ఇంతకుముందు జనాలంతా చైనా మాంజా కావాలని అడిగేవారని, ఇప్పుడు అమ్మకాలు బంద్​చేయడంతో దేశీయ మాంజాకు డిమాండ్​పెరిగిందంటున్నారు. దీంతో దేశీయ మాంజా తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే కొన్ని మాంజాలు కంపెనీల నుంచి వస్తుంటాయని చెబుతున్నారు. ప్లాస్టిక్​పతంగులను కూడా ఎక్కువగా తయారు చేస్తున్నామని, వాటికి కావాల్సిన మెటీరియల్​ను జైపూర్, ఢిల్లీ, కాన్పూర్​ నుంచి తెప్పించుకుంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ తయారు చేసిన పతంగులు, మాంజా, చర్కాలను మన రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు.

 రేట్లు పెరిగే చాన్సుంది

పండగ దగ్గర వచ్చిన కొద్ది రేట్లు పెరిగే చాన్సుంది. ప్రస్తుతానికైతే లాస్ట్ ఇయర్​తో పోల్చుకుంటే నార్మల్ రేట్లే ఉన్నయి. చైనా మాంజా ఏడ కనవడ్తలేదు. జరిగిన ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అందరు మానేశిన్రు.  ఎక్కువగా మయూర కంపెనీకి సంబంధించిన కాటన్ మాంజాను వాడుతున్నారు.  ఇది అందరికి కూడా మంచి విషయం, అందరూ కాటన్ మాంజానే వాడాలని సూచిస్తున్నాను. 

దుర్గం నాగరాజు, కొనుగోలుదారుడు,  రామంతాపూర్

కాటన్ థ్రెడ్ మాత్రమే వాడుతున్నం

లాస్ట్ ఇయర్ కి ఇప్పటికీ రేట్లలో పెద్దగా తేడా లేదు. మేము కాటన్ థ్రెడ్ మాత్రమే వాడుతున్నం.  కొన్నేండ్ల కింద చైనా మాంజా వాడినం. కానీ, ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్లు చూసి బంద్ చేసినం. నేను డిగ్రీ ఫస్టియర్​ చదువుతున్నా. నేను ఏడేండ్లుగా కైట్స్ ఎగరేస్తున్న. పండుగ వచ్చిందంటే సెలవుల్లో దోస్తులతోని కైట్ ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తాం. అందరు కూడా చైనా మాంజా వాడడం మానేసి పండగను ప్రశాంతంగా చేసుకోవాలి

వరుణ్ కుమార్, కొనుగోలుదారుడు,  శంషాబాద్ 

చైనా మాంజా అమ్మడం లేదు 

చైనా మాంజాతో చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఎంతోమంది గాయపడుతున్నారు. అందుకే చైనా మాంజా అమ్మొద్దు, కొనొద్దని సలహా ఇస్తున్నా. మేము ఏడాదంతా పేపర్ పతంగులే తయారు చేసి సీజన్​లో లోకల్​గా ఉన్న 20 షాపులకు అమ్ముతం. బయట రాష్ట్రాలకు కూడా ఎక్స్​పోర్ట్​చేస్తం. మా తాత కానిస్టేబుల్, ముత్తాత ఫ్రీడమ్ ఫైటర్. తాత చనిపొయాక మా అమ్మమ్మ పేపర్ కైట్స్ తయారీ స్టార్ట్ చేసింది. తర్వాత మా అమ్మ, ఆమె నుంచి మేము నేర్చుకుని కంటిన్యూ చేస్తున్నాం. 30 ఏండ్ల నుంచి మా కుటుంబం ఇదే వృత్తి మీద ఆధారపడి ఉంది. 

 రుద్రేశ్ సింగ్, విక్రయదారుడు, ధూల్​పేట్​

400 దుకాణాలకు సీజనల్ గూడ్స్ సప్లై చేస్తం 

మేము అన్ని రకాల సీజనల్ గూడ్స్ తయారుచేసి అమ్ముతం. మా తాతల కాలం నుంచి ఇప్పటివరకు 60 ఏండ్లుగా ఇదే పని చేస్తున్నం. మన రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని 400 దుకాణాలకు సీజనల్ గూడ్స్ సప్లై చేస్తుంటాం. మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నాలుగు నెలల కిందటనే కైట్స్ హోల్​సేల్​ బిజినెస్ స్టార్టయ్యింది. మాకు లాస్ట్ ఇయర్​తో పోల్చుకుంటే 20% బిజినెస్ పెరిగింది. మేము గణేశ్, దుర్గామాత విగ్రహాలు, ప్లే కార్డ్స్ రాఖీలు, రంగులు ఇలా అన్ని సీజనల్ గూడ్స్ కూడా తయారు చేస్తాం. 

బాలాజీ, విక్రయదారుడు, ధూల్​పేట్