రాజన్న సిరిసిల్ల, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఇంటికి సాగనంపే టైం వచ్చిందని తీన్మార్ మల్లన్న అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతారని ఆయన పేర్కొన్నారు. గురువారం సిరిసిల్ల నియోజకవర్గం సారంపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సిరిసిల్ల గడ్డ రుణం తీర్చుకోవడం కోసం సోనియాగాంధీ దీవించి పంపిన కేకే మహేందర్‌రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఇక్కడి ప్రజలు పౌరుషం ఉన్న బిడ్డలని ఆయన అన్నారు. రాష్ట్రం అంతటా కాంగ్రెస్ వస్తున్నదని, సిరిసిల్లలో కూడా కాంగ్రెస్ రావాలని ఆయన అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు కొన్ని హక్కులుంటాయని, సిరిసిల్ల ప్రజలకు మాత్రం హక్కులు లేవన్నారు. ఇక్కడి ప్రజలను ఓటేసే యంత్రాలుగా తయారు చేశారని, వారు ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ లాంటి మహా నాయకుడే కాంగ్రెస్ ప్రభంజనంలో ఓడిపోయారన్నారు. ఆ రామారావే ఓడిపోయాక ఈ రామారావు ఎంత అని తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేశారు. సిరిసిల్ల చరిత్రలో నేరేళ్ల ఘటన తనను కలిచివేసిందన్నారు. దళితులను పోలీసులతో విచక్షణారహితంగా కేటీఆర్ కొట్టించాడని ఆయన ఫైర్ అయ్యారు.