
- ప్రభుత్వ సలహాదారు కేకే
- బీసీల రాజ్యాధికారం కోసం పోరాడతానని వెల్లడి
- కోటా బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం
- జలవిహార్ లో ‘దశదిశ మున్నూరుకాపు ఆత్మీయ సభ’
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించిన ‘దశదిశ మున్నూరుకాపు ఆత్మీయ సభ’ లో ఆయన మాట్లాడారు. బీసీలకు రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాడతానని పేర్కొన్నారు. బీసీ కోటా బిల్లుకు తప్పనిసరిగా ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మున్నూరుకాపులు అధికంగా ఉన్నారని తెలిపారు. కుల సంఘాలు బీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ.. బీసీల్లో అత్యధిక శాతం మున్నూరు కాపులేనని అన్నారు. ఐక్యతతో అందరం పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యావేత్త, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా గెలవడంలో మున్నూరుకాపుల పాత్ర చాలా ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మున్నూరుకాపుల సమావేశానికి రెడ్ల అనుమతి ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఏవిధంగా ఆదర్శం అని ప్రశ్నించారు.
బీసీ వర్గాల నుంచి 50 లక్షల మంది మాయం అయ్యారని ఆరోపించారు. అసమానతలను అధిగమించి హక్కులను సాధించుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. మున్నూరుకాపులు మరో స్వాతంత్ర్య సమరం సాగించాలని కోరారు. కులగణన సర్వేలో మున్నూరుకాపులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఈ సామాజికవర్గానికి చాలాసార్లు ప్రభుత్వాలు అన్యాయం చేశాయని, ఈసారి అవమానం కూడా జరిగిందని వాపోయారు.
మూడున్నర శాతం జనాభా ఉన్న మీకు పార్టీ అధ్యక్ష పదవి ఎందుకని పార్టీలు అంటున్నాయని పేర్కొన్నారు. ఒక్క ఉత్తర తెలంగాణలోనే మున్నూరుకాపులు 13 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. గ్రామాల వారీగా కులగణన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, వినయ్ భాస్కర్, మున్నూరుకాపు ప్రముఖులు పుటం పురుషోత్తంతో పాటు భారీ ఎత్తున మున్నూరుకాపు ప్రతినిధులు పాల్గొన్నారు.