శభాష్ నరైన్: 75 గంటల్లో.. 2 దేశాల్లో.. 4 మ్యాచులు

శభాష్ నరైన్: 75 గంటల్లో.. 2 దేశాల్లో.. 4 మ్యాచులు

విండీస్ ఆల్ రౌండర్, కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) కీలక ఆటగాడు సునీల్ నరైన్ గురుంచి అందరికీ విదితమే. అంతుచిక్కని బంతులు సంధిస్తూ బ్యాట్లర్లను ముప్పతిప్పలు పెట్టగల మాయల మాంత్రికుడు. సూపర్ ఓవర్‌ను సైతం మెయిడిన్ చేయగల సత్తా అతని సొంతం. అందుకే ప్రపంచంలో ఈమూల.. ఏ టోర్నీ జరిగినా ఈ మిస్టరీ స్పిన్నర్ ఉండి తీరాల్సిందే. 

ప్రపంచవ్యాప్తంగా కేకేఆర్ యాజమన్యానికి నాలుగు ఫ్రాంచైజీలు ఉంటే అన్నింటిలోనూ నరైన్ ఆడుతున్నాడు. ఇవికాక.. ఇంగ్లండ్ డొమెస్టిక్ లీగ్ టీ20 బ్లాస్ట్‌లో సర్రే జట్టు తరుపున ఆడుతున్నాడు. ఆ బాధ్యతలే అతడిని 75 గంటల్లో రెండు దేశాలు చుట్టేలా చేస్తున్నాయి. ఈ ప్రయాణంలో అతడు ఏకంగా14,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నాడు.

75 గంటల్లో 4 మ్యాచులు

మేజర్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో నరైన్.. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు.. జూలై 13న(గురువారం) టెక్సాస్ సూపర్ కింగ్స్(TSK vs LAKR) తో తలపడనునున్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ బయలుదేరనున్నాడు. అనంతరం జూలై15న 'టీ20 బ్లాస్ట్'లో సర్రే జట్టు తరఫున సోమర్ సెట్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో సర్రే జట్టు విజయం సాధిస్తే.. అదే రోజు రాత్రి ఫైనల్ కూడా ఆడాల్సి ఉంది.  

ఈ రెండు మ్యాచ్‌లు ముగిసిన వెంటగనే  నరైన్ మళ్లీ యూఎస్‌కు బయలు దేరాలి. ఎందుకంటే.. జులై 16న రాత్రి లాస్ ఏంజెల్స్ జట్టు ఎంఐ న్యూయార్క్‌తో తలపడనుంది. అంటే.. మూడు (సర్రే  ఫైనల్‌కు వెళ్తే నాలుగు) మ్యాచ్‌లు ఆడేందుకు గాను నరైన్.. 9వేల మైళ్లు (సుమారు 14,500 కిలోమీటర్లు) దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అది కూడా కేవలం 75 గంటల వ్యవధిలో. ఇంత డెడికేషన్ ఉన్న ప్లేయర్ కాబట్టే నరైన్ వయసు మీద పడ్డా ఫ్రాంచైజీలు అతడిని వదులుకోవడం లేదు.