- ప్లేఆఫ్స్ రేసు నుంచి టైటాన్స్ ఔట్
అహ్మదాబాద్: పోటాపోటీగా నడుస్తున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో వాన దేవుడు బోణీ కొట్టాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఇరు జట్లకూ చెరో పాయింట్ లభించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న కేకేఆర్ ఈ ఫలితంతో 19 పాయింట్లతో టాప్2 ప్లేస్ ఖాయం చేసుకుంది.
13 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. కాగా, సాయంత్రం నుంచే వాన, మెరుపులుతో గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మధ్యలో ఒకటి రెండుసార్లు తగ్గినా మళ్లీ మొదలైంది. రాత్రి పదిన్నర గంటలకు పూర్తిగా తగ్గడంతో పిచ్‌పై కవర్లు తీసేశారు. కానీ, వికెట్, ఔట్ ఫీల్డ్‌ను పరిశీలించిన అంపైర్లు కనీసం 5 ఓవర్ల ఆట నిర్వహించేందుకు కూడా అనువుగా లేదని గుర్తించి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.