కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) మెంటార్ గౌతం గంభీర్‌ను టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా నియమించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. T20 వరల్డ్ కప్ 2024 ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగుస్తున్న క్రమంలో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ కోసం వేటలో ఉంది. మే 13న, భారత పురుషుల ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బీసీసీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది.
ప్రధాన కోచ్ పదవి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ద్రవిడ్ ను బీసీసీ కోరినా.. ఆయన ఆసక్తి లేదని బోర్డుకి తెలియజేసినట్లు సమాచారం. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) కోచ్ వివిఎస్ లక్ష్మణ్ కూడా భారత జట్టుకు ప్రధాన కోచ్ పదవిని చేపట్టడం పట్ల నిరాసక్తతను వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను భారత జట్టుకు ప్రధాన కోచ్ గా నియమించేందుకు బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బోర్డు సభ్యులు.. గంభీర్ ను సంప్రదించి చర్చలు జరిపారట. మరోవైపు, భారత జట్టుకు ప్రధాన కోచ్ గా వ్యవహరించేందుకు గంభీర్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
గౌతమ్ గంభీర్‌కు అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో జట్టుకు శిక్షణ ఇచ్చిన అనుభవం లేదు కానీ.. లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు IPL ఫ్రాంచైజీల కోచింగ్ సిబ్బందికి ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. LSGకి కోచ్‌గా, మెంటర్ గా పనిచేసిన గంభీర్.. 2022, 2023లో వరుసగా రెండు IPL సీజన్‌లలో ఆ జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
గంభీర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మెంటార్ గా ఉన్నాడు. గంభీర్ మెంటర్‌షిప్ లో కేకేఆర్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ ఉన్న కేకేఆర్.. లీగ్ దశలో రెండవ స్థానంలో నిలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 1లో ఆడనుంది.