
చెన్నై: ఐపీఎల్ సీజన్-18లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరిస్థితి ‘నానాటికీ తీసికట్టు.. నాగంబొట్టు’ మాదిరిగా తయారైంది. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 103 పరుగులకే పరిమితమైంది. ఈ 103 పరుగులు చేయడానికి చెన్నై జట్టు పడిన ఆపసోపాలు అన్నీఇన్నీ కావు. చెపాక్ స్టేడియంలో పరుగులు చేయడం కంటే మొక్కలు నాటడానికే చెన్నై బ్యాట్స్మెన్స్ మస్తు ఇంట్రస్ట్ చూపించిరంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయంటే చెన్నై పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 6 ఓవర్లకు 31 పరుగులు మాత్రమే చేసి ఐపీఎల్-2025 సీజన్లో సెకండ్ లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ చేసి చెన్నై జట్టు అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఐపీఎల్ 2025లో ఇప్పటికి చెన్నై చేసిన 103 పరుగులే లోయెస్ట్ టోటల్ కావడంతో చెన్నై ఫ్యాన్స్కు ఈ రాత్రికి నిద్ర పట్టేలా లేదు. ఒకానొక దశలో 100 పరుగులు కూడా చేస్తారో.. లేదో అని చెన్నై ఫ్యాన్స్ కంగారు పడ్డారు.
63 బంతుల తర్వాత 18వ ఓవర్ మూడో బంతికి బౌండరీ వచ్చిందంటే చెన్నై చెత్త బ్యాటింగ్కు ఇంతకు మించిన నిదర్శనం ఉండదేమో. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన లోయెస్ట్ స్కోర్ ఇదే కావడం గమనార్హం. 2019లో ఇదే స్టేడియంలో చెన్నై జట్టు ముంబై ఇండియన్స్తో ఆడి 109 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై జట్టుకు ఇన్నాళ్లు చెపాక్ స్టేడియంలో 109 పరుగులు మాత్రమే లోయెస్ట్ స్కోర్ కాగా.. ఇవాళ చెన్నై పేలవ బ్యాటింగ్తో (103 పరుగులు) ఈ రికార్డు కూడా చెరిగిపోయింది. గాయం కారణంగా చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి రుతురాజ్ గైక్వాడ్ తప్పుకోవడంతో ధోనీ నాయకత్వం వహించాడు.
ధోనీ కెప్టెన్సీలో కూడా చెన్నై జట్టు తలరాత మారలేదు. 2025 ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు ఇప్పటికి ఒక్క మ్యాచ్ గెలిచి, వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది. చెన్నై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ధోనీ నాయకత్వంలోనైనా పుంజుకోకపోతామా అని ఆశించారు. కానీ.. చెన్నై జట్టును దరిద్రం అదృష్టంలా పట్టింది. రచిన్ రవీంద్ర 4 పరుగులు, కాన్వే 12 పరుగులు, త్రిపాఠి 16 పరుగులు, విజయ్ శంకర్ 29, శివమ్ దూబే 31 (నాటౌట్), అశ్విన్ 1, జడేజా డకౌట్, దీపక్ హుడా డకౌట్, ధోనీ 1, నూర్ అహ్మద్ 1, అన్షుల్ కాంబోజ్ 3 పరుగులు. ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ సాగిన తీరు.
చెన్నై బ్యాటింగ్ను కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ మాములు దెబ్బ కొట్టలేదు. 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి.. 3 వికెట్లు తీసి.. త్రిపాఠి, జడేజా, ధోనీ.. ముగ్గురినీ పెవిలియన్కు పంపించేశాడు. హర్షిత్ రానా కూడా 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, మొయిన్ అలీ, వైభవ్ అరోరాకు చెరో వికెట్ దక్కింది. చెన్నై అభిమానులకు మాత్రం ఈరాత్రి ‘కాళ రాత్రి’ అని చెప్పక తప్పదు. ఒకవేళ అంతా మర్చిపోయి నిద్రపోవడానికి ప్రయత్నించినా చెన్నై బ్యాటింగ్ పీడ కలలా వెంటాడుతుందనడంలో సందేహమే లేదు.
ఇంత జరిగినా చెన్నై అభిమానులకు కాస్తోకూస్తో ఊరట కలిగించే విషయం ఏంటంటే.. 2017లో ఈడెన్ గార్డెన్స్లో కోల్ కత్తాను 131 పరుగులకే పరిమితం చేసి.. 132 పరుగుల టార్గెట్ ఛేదించలేక 49 పరుగులకే ఆలౌట్ అయిన ఆర్సీబీ దుస్థితి కంటే చెన్నై చేసిన 103 పరుగులు కొంత బెటర్ అనే చెప్పాలి.