IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు.. భారత జట్టులోకి 'కిస్సింగ్ స్టార్'

IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు.. భారత జట్టులోకి 'కిస్సింగ్ స్టార్'

కిస్సింగ్ స్టార్రా.. ఎవరీ పోటుగాడు అనుకోకండి. ఈ పేరుకు చాలా పెద్ద కథ ఉంది. ఇతగాడి పేరు.. హర్షిత్ రాణా. 22 ఏళ్ల కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్. యువ రక్తం కదా మైదానంలో దూకుడెక్కువ. తన బౌలింగ్‌లో ఔటైన బ్యాటర్లందరికీ గాల్లో ముద్దులిచ్చుడు ఇతని పని. అందుకే, ఇతగాడిని ముద్దుగా 'కిస్సింగ్ 'అని పిలుస్తుంటారు. తాజాగా, ఈ యువ పేసర్‌కి జట్టులో చేరాలని భారత సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. 

ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. ఆఖరి టెస్టులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చివరి టెస్ట్ జరగనుంది. ఈ ఆఖరి టెస్టుకి స్టార్ పేసర్ హర్షిత్ రాణాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. హుటాహుటిన ముంబై చేరుకొని జట్టుతో చేరాల్సిందిగా అతనికి సూచించారు.

ఎంపిక చేసి.. వదిలేసింది

న్యూజిలాండ్‌తో  టెస్ట్ సిరీస్ కోసం సెలెక్టర్లు ఇదివరకే హర్షిత్ రాణాను ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. జట్టులో బుమ్రా, సిరాజ్ రూపంలో స్టార్ పేసర్లు ఉండటం.. మరోవైపు దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ప్రారంభమవ్వడంతో అతన్ని రిలీజ్ చేసింది. ఢిల్లీ రంజీ జట్టుకు ఆడుతున్న ఈ పేసర్ అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఐదు వికెట్లు పడగొట్టడమే కాకుండా.. బ్యాటింగ్‌లో  హాఫ్ సెంచరీ బాదాడు. ఇతను జట్టుకు ఉపయోగపడేలా ఉండటంతో సెలెక్టర్లు పిలుపు అందించారు. 

ముద్దులపై ఐసీసీ సీరియస్

కాగా, గడిచిన ఐపీఎల్ సీజన్‌లో హర్షిత్ రాణా దూకుడుగా సంబరాలు చేసుకొని ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. కేకేఆర్ వర్సెస్ ఆర్‌ఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం అతనికి గాల్లోకి ముద్దులు విసిరాడు. దాంతో, ఐపీఎల్ కౌన్సిల్ అతనికి జరిమానా విధించింది. అయినప్పటికీ, అతను మాత్రం ముద్దులివ్వడం ఆపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌లోనూ హర్షిత్ అవే సెలబ్రేషన్స్ రిపీట్ చేసి.. ఓ మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొన్నాడు.