IPL 2025: కన్నీళ్లు తన్నుకొచ్చాయి.. రిటైన్ చేసుకోలేదని యువ క్రికెటర్ ఏడుపు

IPL 2025: కన్నీళ్లు తన్నుకొచ్చాయి.. రిటైన్ చేసుకోలేదని యువ క్రికెటర్ ఏడుపు

రాబోయే ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలన్నీ తమ రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు కురిపిస్తూ కొందరిని అంటిపెట్టుకోగా.. మిగిలిన వారిని వేలంలోకి వదిలేశాయి. ఈ నిర్ణయమే ఓ ఆటగాడిని కంటతడి పెట్టించింది. మూడేళ్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. అయినప్పటికీ, ఆ జట్టు రిటైన్ చేసుకోలేదని యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కన్నీటి పర్యంతమయ్యాడు.

కేకేఆర్ రిటెన్షన్‌ లిస్టులో తన పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని అయ్యర్ చెప్పుకొచ్చాడు. అయితే, వేలంలో ఫ్రాంచైజీ తనను తిరిగి కొనుగోలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టు ఒక పరిపూర్ణమైన కుటుంబం. 16, 20, 25 మంది ఆటగాళ్లను ఉద్దేశించి నేను ఇలా చెప్పడం లేదు. మేనేజ్‌మెంట్, సిబ్బంది, తెరవెనుక ఉన్న కుర్రాళ్లు.. ఇలా అందరూ కలగలిసి పోరాడే కుటుంబం. దీని వెనుక చాలా భావోద్వేగం దాగుంటుంది. రిటెన్షన్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయి.." అని అయ్యర్.. రెవ్‌స్పోర్ట్స్‌తో తన బాధను పంచుకున్నాడు.

అదే సమయంలో కేకేఆర్ రిటెన్షన్ జాబితాను అయ్యర్ ప్రశంసించాడు. అంటిపెట్టుకున్న ఆరుగురు అత్యుత్తమ ఆటగాళ్ళని కొనియాడాడు. బౌలింగ్ విషయంలో 14-16 ఓవర్లు, బ్యాటింగ్‌లో ఐదు స్థానాలను కవర్ చేశారని వెల్లడించాడు. 

Also Read :- సిరీస్‌ పోయినందుకు బాధగా ఉంది

అయ్యర్ గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. 2021లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలోనూ.. 2024 సీజన్‌లో ఆ జట్టు ట్రోఫీ ముద్దాడడంలోనూ తనవంతు సహకారం అందించాడు. ఓపెనర్‌గా మంచి భాగస్వామ్యాలు అందించాడు. గడిచిన  సీజన్‌లో 4 అర్ధసెంచరీలు బాదాడు. మొత్తంగా 158.80 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 370 పరుగులు సాధించాడు.

కేకేఆర్ రిటెన్షన్ లిస్ట్

  • సునీల్ నరైన్: రూ.12 కోట్లు
  • ఆండ్ర్యూ రస్సెల్: రూ.12 కోట్లు
  • రింకూ సింగ్: రూ.12 కోట్లు
  • వరుణ్ చక్రవర్తి: రూ.13 కోట్లు
  • రమణదీప్ సింగ్: రూ.4 కోట్లు
  • హర్షిత్ రాణా: రూ.4 కోట్లు