మూడో టైటిల్ టార్గెట్‌గా బరిలోకి ప్రపంచంలోనే ఖరీదైన, ఖతర్నాక్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కోసం క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా ఆక్షన్ తర్వాత అన్ని జట్లలో ఆటగాళ్లు అటు ఇటు మారిన నేపథ్యంలో ఏ టీమ్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి రెట్టింపైంది. ఈ క్రమంలో గతేడాది అనూహ్యంగా ఫైనల్‌కు దూసుకొచ్చి రన్నరప్‌గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ ఎట్లుందో చూద్దాం..!
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్): గత సీజన్ తొలి దశలో చెత్తగా ఆడి.. యూఏఈ గడ్డపై రెండో దశలో రెచ్చిపోయిన కోల్‌కతా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ వరకు వెళ్లిన ఆ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి మూడో టైటిల్‌ను కొద్దిలో చేజార్చుకుంది. అయితే ఆరు నెలలు తిరగక ముందే ఆ టీమ్ కెప్టెన్‌ను మార్చేసిన ఫ్రాంచైజీ షాకిచ్చింది. మోర్గాన్‌ను వదులుకున్న కేకేఆర్ వేలంలో రూ.12.25 కోట్ల ధరతో కొనుక్కున్న టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్ గా నియమించింది. శ్రేయస్ తో పాటు లోకల్ ప్లేయర్లు వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ రాణా.. కమిన్స్, రసెల్, నరైన్ వంటి ఫారిన్ స్టార్స్‌తో కేకేఆర్ కోర్ టీమ్ బలంగానే కనిసిస్తోంది. గ్రూప్–ఎలో ఉన్న శ్రేయస్ సారథ్యంలోని కేకేఆర్ మూడోసారి కప్పు నెగ్గాలన్న కలను ఈసారైనా నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఈ నెల 26న జరిగే తొలి పోరులో గతేడాది విన్నర్ సీఎస్కేతో తలపడనుంది.
బలాలు
కొంతకాలంగా సూపర్ ఫామ్ తో దుమ్మురేపుతున్న శ్రేయస్ అయ్యర్ టీమ్‌కు కొండంత అండ. వెస్టిండీస్ తో వన్డే, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్ లో గొప్పగా రాణించిన అతడు.. ఈ లీగ్ లోనూ బ్యాట్ కు పనిచెబితే జట్టుకు తిరుగుండదు. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్ గానూ శ్రేయస్ కు మంచి రికార్డుంది. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ను అతడు ఫైనల్ వరకు తీసుకెళ్లి కొద్దిలో ట్రోఫీ మిస్ అయ్యాడు. ఇక, అయ్యర్‌తో పాటు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ వెంకటేశ్, కమిన్స్, రసెల్ ఈ టీమ్ స్టార్ పెర్ఫామర్స్ అనడంలో సందేహం లేదు. ఇండియా పిచ్‌లపై జోరు చూపించే స్పిన్నర్లు వరుణ్, నరైన్ ఉండనే ఉన్నారు.
బలహీనతలు
బ్యాటింగ్‌లో ఈ టీమ్ కాస్త వీక్ గా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ లో మన్నికైన ఇండియన్ ప్లేయర్లు కరువయ్యారు. శ్రేయస్, నితీశ్ రాణా మినహాయిస్తే మిడిల్ లో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో రింకూ సింగ్, అభిజీత్ తోమర్, ప్రథమ్ సింగ్ లాంటి యంగ్ ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ నింపడం చాలా ముఖ్యం. ఇక ఈ టీమ్ టాపార్డర్ లో కీలకమవుతాడనుకున్న అలెక్స్ హేల్స్ లీగ్ నుంచి తప్పుకోవడం కాస్త మైనస్. అతడి ప్లేస్ లో వచ్చిన ఆరోన్ ఫించ్.. పెద్దగా ఫామ్‌లో లేడు. అజింక్యా రహానె లాంటి సీనియర్ ప్లేయర్ కనిపిస్తున్నా.. అతడిని బెంచ్ కు పరిమితం చేసే చాన్సే ఎక్కువ. టిమ్ సౌథీ, మహ్మద్ నబీ ఉన్నా.. ఫారిన్ ప్లేయర్ల లిమిట్ ను దృష్టిలో ఉంచుకుంటే వారికి తుది జట్టులో అవకాశాలు రావడం కూడా సందేహమే.
కోల్‌కతా టీమ్ ఇండియన్స్: శ్రేయస్ (కెప్టెన్), చక్రవర్తి, వెంకటేశ్, రాణా, మావి, షెల్డన్, రహానె, రింకూ సింగ్, అనుకూల్, రసిఖ్, ఇంద్రజిత్, అశోక్ శర్మ, ప్రథమ్, అభిజీత్, రమేశ్, అమన్, ఉమేశ్ యాదవ్.
ఫారిన్ ప్లేయర్లు: రసెల్, నరైన్, కమిన్స్, చమిక కరుణరత్నె, సామ్ బిల్లింగ్స్, ఫించ్, నబీ.
ఎవరితో ఎన్ని మ్యాచ్‌లు..
గ్రూప్-ఎలో ఉన్న కేకేఆర్.. అదే గ్రూప్‌లో ఉన్న ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, లక్నోలతో పాటు గ్రూప్-బిలోని హైదరాబాద్‌తో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. అలాగే చెన్నై, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ తో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది.
బెస్ట్ పెర్ఫామెన్స్: 2012, 2014లో విన్నర్
2021 సీజన్లో: రన్నరప్